తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో దేవాలయాలకే రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
తిరుపతి సమీపంలోని ఆంజనేయపురంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాన్ని తొలగించడాన్ని సమర్థించడం సరికాదని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఆలయ కూల్చివేతపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ భూముల లీజులు, ఆలయాల నిర్వహణ, భక్తుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే హిందూ భక్తులు, స్వామీజీలను కలుపుకొని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
దేవాలయాలకే రక్షణ లేకుండా పోయింది… : వెలంపల్లి, మల్లాది విష్ణు
