-4 మేయర్, 19 చైర్పర్సన్ పదవులకు 170 మంది అభ్యర్థులు పోటీ
-964 వార్డులకు పోలింగ్.. 24.98 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు
-పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి
-రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న 23 పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఇందులో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో 4 మేయర్, 19 చైర్పర్సన్ పదవులకు మొత్తం 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాలకు గాను 41 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 5 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. మిగిలిన 964 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాలకు మొత్తం 2,968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
24.98 లక్షల మంది ఓటర్లు
23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 24,98,312 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 12,04,819 మంది పురుషులు, 12,93,084 మంది మహిళలు, 409 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
2,801 పోలింగ్ కేంద్రాల గుర్తింపు
ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, జోనల్ అధికారులు, రూట్ అధికారులను నియమించినట్లు కమిషనర్ తెలిపారు. మొత్తం 2,801 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, 2,698 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 819 కేంద్రాలను సెన్సిటివ్‌గా, 597 కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా గుర్తించి, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 5,602 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు
పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 23 కౌంటింగ్ కేంద్రాలు, 115 కౌంటింగ్ హాళ్లు, 842 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించినట్లు వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి, ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు కీలకం
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భయభ్రాంతులకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
