రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కె. బుచ్చి రామ్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించే మహోన్నత గ్రంథమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.
క్రైస్తవులకు బైబిల్, హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్ ఎంతటి పవిత్రమైనవో, భారత పౌరులందరికీ రాజ్యాంగం అంతటి గౌరవప్రదమైన మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. మతం, కులం, ప్రాంతం, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, భావప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవిస్తూ ప్రజాపాలన సాగిస్తోందని బుచ్చి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం, అన్ని వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ స్ఫూర్తి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. హక్కులను తెలుసుకోవడంతో పాటు పౌరులుగా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు), గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ, బాధ్యతలను నిర్వర్తించినప్పుడే సమానత్వం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధితో కూడిన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని బుచ్చి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.