విజయవాడలో అత్యాధునిక సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.50 లక్షల నిధులు మంజూరు

Kesineni

-రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం, పారదర్శకం కానున్నాయి: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

ఢిల్లీ / విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ప్రజలు ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమం కింద విజయవాడలో అత్యాధునిక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం తరహా నమూనా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు మొదటి దశలో రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది.
భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమంలోని డీఐఎల్ఆర్‌ఎంపీ 3.0, నక్షా పథకాల పరిధిలో ఈ నిధులు కేటాయించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ప్రజల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం కోసం తాను పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులకు సానుకూల ఫలితం లభించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ అత్యాధునిక కార్యాలయం అందుబాటులోకి వస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం, వేగవంతం, పారదర్శకంగా మారుతాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో చేసిన నిరంతర ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడం విజయవాడ అభివృద్ధిలో మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు విజయవాడ ప్రజల తరఫున ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.