-ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన
అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త:
తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అతి తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి నాగాయలంక, కోడూరు మండలాల్లో తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పరిస్థితులు ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అధికారుల సూచనల మేరకే నడుచుకోవాలని, పునరావస శిబిరాలకు వెళ్లాలని కోరితే వారికి సహకరించాలని సూచించారు. పశుసంపదను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, తీవ్రమైన తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. అధికారులు ప్రభుత్వం తరఫున చేపట్టవలసిన చర్యలు చేపడతారని తెలిపారు. ప్రజలు సహకరించడమే కాకుండా తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు గమనించాలని ఎమ్మెల్యే కోరారు.
