విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రెండవ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రదేశం, ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు, సిబ్బంది బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మ్యాప్ ద్వారా పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, సమయపాలనకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించే విధానంపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది రాకపోకలు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, ఏ. శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
