69వ డివిజన్‌లో వైసీపీ విస్తృత ఎన్నికల ప్రచారం

-ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 69వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 69వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కమ్మిలి రత్నకుమార్‌తో కలిసి మారుతీ వ్యాయామశాల సమీపం నుంచి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కమ్మిలి రత్నకుమార్‌ను, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, ముఖ్యంగా మహిళలు గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని కోరారు. వైసీపీ అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
69వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కమ్మిలి రత్నకుమార్ మాట్లాడుతూ.. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్‌లోని స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా, రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.