అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
– 1064 టోల్‌ఫ్రీ నంబ‌రు ప్ర‌చార పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో అవినీతి నిరోధక శాఖ రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్లను కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ఆవిష్కరించారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రజలు వినియోగించుకోవాలని, అవినీతి నిర్మూలనకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వాట్సాప్ నంబ‌రు (94404 40057), complaints-acb@ap.gov.in కూడా అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం అందేలా ప్రతి శాఖలో అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంపొందించేందుకు అవినీతి నిరోధక చర్యలు, ప్రజల్లో చైతన్యం కీలకమని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, నిజాయితీతో కూడిన పాలనకు సహకరించాలని కోరారు. కార్య‌క్ర‌మంలో ఏసీబీ డీఎస్‌పీ బీవీ సుబ్బారావు, ఇన్‌స్పెక్ట‌ర్ నాగరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.