స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

-జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన
-మాంటిస్సోరి కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జరుగుతున్న జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియతో పాటు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్క్రూటినీ కొనసాగుతున్న తీరును, అభ్యర్థులు దాఖలు చేసిన పత్రాల పరిశీలన విధానాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.సుశీల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని, అర్హతలు, ధ్రువపత్రాల పరిశీలనలో ఏ విధమైన అలసత్వానికి తావివ్వరాదని స్పష్టం చేశారు.

అనంతరం, విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి నగరంలోని మాంటిస్సోరి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు మరియు నిరంతర సీసీటీవీ నిఘా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్ రోజున సిబ్బందికి, అభ్యర్థులకు, ఏజెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతరాయ పవర్ సప్లై/జనరేటర్లు, సరైన లైటింగ్, వెంటిలేషన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలి. ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కౌంటింగ్ టేబుళ్లు, బారికేడ్ల ఏర్పాటు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంలో జిల్లా పరిషత్ సీఈఓ పి.సుశీల, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, జిల్లా పరిషత్ మరియు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.