-40వేల మందికి అవకాశం
-ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి
-దివ్యాంగులకు అనుకూలంగా బుకింగ్ విధానంలో 4 కీలక మార్పులు!
-ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా నమోదుకు అవకాశం!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దివ్యాంగులకు ఉద్దేశించిన సదరం స్లాటు బుకింగ్ అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం స్లాటు బుకింగ్‌కు అవకాశాన్ని కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుకింగ్ కోసం రెండు నెలల వరకు గడువు ఇవ్వనున్నారు. ఆన్లైన్ ద్వారా సుమారు 40వేల మంది దివ్యాంగులకు స్లాటు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. వాట్సప్ మనమిత్ర, సచివాలయాల ద్వారా మాత్రమే కాకుండా. ఈ సారి అదనంగా ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ స్లాటు బుకింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందినట్లు వెల్లడించింది.
6 నెలల వరకు రాకుండా ఉంటే..!
స్లాటు బుకింగ్ విధానంలో ఈ సారి 4 కొత్త పద్ధతులను ప్రవేశ పెట్టబోతున్నారు.
1.స్లాటు బుక్ చేసుకుని వైద్య పరీక్షలకు ఆరు నెలల వరకు హాజరు కాకుంటే.. ఆటోమేటిగ్గా ఆన్లైన్లో సదరు వ్యక్తి వివరాలు కనిపించవు. వైద్య పరీక్షలు జరగవు. ప్రస్తుత విధానంలో కాలపరిమితి లేనందున అభ్యర్థులు చాలా ఆలస్యంగా ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనివల్ల ఒక్కోసారి కొత్తగా స్లాట్లు పొందిన వారు అవస్థలు పడుతున్నారు. 6 నెలల కాల పరిమితి విధానంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరింత వెసులుబాటు లభిస్తుంది. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులు కూడా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది.
2.వాట్సాప్ మనమిత్ర, సచివాలయాల ద్వారా మాత్రమే కాకుండా.. ఈ సారి అదనంగా ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
..
3.స్లాటు బుకింగ్ తేదీకి అనుగుణంగా సదరు దివ్యాంగులు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు అవసరమైన సమాచారాన్ని ఎక్కడ పొందాలన్న విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ సారి కొత్తగా “సింగిల్ పాయింటు ఆఫ్ కంటాక్ట్” విధానంలో సంప్రదించాల్సిన ఉద్యోగి (హెల్ప్ డెస్క్ మాదిరిగా) వివరాలను ముందుగానే తెలియబరచనున్నారు.
4.దివ్యాంగత్వ ప్రమాణాలకు అర్హత సాధించని వ్యక్తులు కొత్తగా మళ్ళీ స్లాటు బుక్ చేసుకునేందుకు (అపీల్) మరింత వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత విధానంలో పాత ఐడీ తొలగింపు కోసం గ్రీవెన్స్ పోర్టల్ లో ఎంట్రీ లేదా సదరు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై అలాకాకుండా బుకింగ్ సమయంలోనే ఓటీపీ విధానం ద్వారా యధావిధిగా స్లాటు బుక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఇప్పటివరకు 1.11 లక్షల మందికి వైద్య పరీక్షలు
ఈ ఏడాది ఇప్పటి వరకు 1,38,612 మందికి స్లాటు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించగా 1,28,410 మంది సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో 1,11,163 మంది వైద్య పరీక్షలకు హాజరయ్యారు. మిగిలిన వారు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. దీనివల్ల తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ఆరు నెలల కాల పరిమితిని నిర్దేశించారు.
