వైద్య ఆరోగ్య శాఖ సర్వం సన్నద్ధం

-ప్రభావిత జిల్లాల్లో 6,431 అత్యవసర పడకలు..
-630 వైద్య బృందాలు సిద్ధం
-ఇప్పటికే 1,075 మంది గర్భిణులు ఆసుపత్రులకు తరలింపు
-రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో 24 గంటలూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల పర్యవేక్షణ
-జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు 6,431 అత్యవసర పడకలు, 630 వైద్య బృందాలు, 254 అత్యవసర అంబులెన్సులు, 136 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు, 326 సంచార వైద్య వాహనాలను సిద్ధం చేసింది. రానున్న రెండు వారాల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉన్న 2,632 మంది గర్భిణులను గుర్తించి, వారిలో 1,075 మందిని ఇప్పటికే ఆసుపత్రులకు తరలించింది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, వైద్య సేవలు, మందుల నిల్వలు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నివారణ చర్యలను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌ బాబు సోమవారం సాయంత్రం ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

24 గంటలూ పర్యవేక్షణ

రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ద్వారా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 108, 102, 104 సేవలను సమన్వయం చేస్తూ, అత్యవసర మందులు, వైద్య బృందాలు, అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య అవసరాలను గుర్తించి, సత్వరం సేవలు అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు మొత్తం 6,991 ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను అత్యవసర వైద్య సేవలకు సిద్ధం చేశారు. వీటిలో 6,431 అత్యవసర పడకలను అందుబాటులో ఉంచారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,087, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,399, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 547, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 342, జిల్లా ఆసుపత్రుల్లో 106, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో 2,950 చొప్పున పడకలను సిద్ధం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు. పాముకాటు విరుగుడు మందులు 13,101 (injections ASV) సిద్ధం చేశారు.

630 వైద్య బృందాలు.. 716 వాహనాలు

అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు 630 వైద్య బృందాలను సిద్ధం చేశారు. 108 సేవలకు 254 అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలకు 136 వాహనాలు, 104 సేవలకు 326 సంచార వైద్య వాహనాలను అందుబాటులో ఉంచారు. గతంలో అవసరమైన ప్రాంతాలకు వైద్య బృందాలు, వాహనాలు త్వరగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

గర్భిణుల తరలింపు

రానున్న రెండు వారాల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉన్న 2,632 మంది గర్భిణులను గుర్తించారు. వీరిలో 1,075 మందిని ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు. వారిలో 35 మందిని ప్రసవ నిరీక్షణ కేంద్రాల్లో, 231 మందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 117 మందిని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో, 155 మందిని ప్రాంతీయ ఆసుపత్రుల్లో, 79 మందిని జిల్లా ఆసుపత్రుల్లో, 190 మందిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో చేర్చారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా, తల్లీబిడ్డలకు సకాలంలో వైద్యం అందేలా ఈ ముందస్తు ఏర్పాట్లు చేశారు.

విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ఆసుపత్రుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా వైద్య సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తాగునీరు కలుషితం కాకుండా నీటి వనరుల శుద్ధి, క్రిమిసంహారక చర్యలు చేపట్టారు. క్లోరిన్‌ మాత్రలను అందుబాటులో ఉంచారు. సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక శాఖలతో కలిసి జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

### అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు

తుపాను అనంతరం కలుషిత నీరు, ఆహారం, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అవసరమైన మందులు, వైద్య సామగ్రిని సిద్ధం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అంటువ్యాధుల పర్యవేక్షణ కేంద్రాలు 24 గంటలూ పనిచేసేలా ఏర్పాట్లు చేశారు.

సమన్వయంతో పనిచేయాలి:: కార్యదర్శి

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌ బాబు, ప్రజారోగ్య సంచాలకులు వెంకటరమణ, సంయుక్త సంచాలకులు అర్జున్‌రావు, వైద్య విద్య సంచాలకులు విష్ణువర్ధన్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ కార్యనిర్వాహణాధికారి పద్మావతి, ఆహార భద్రత సంచాలకులు అరుణ్‌ బాబు, ద్వితీయ వైద్య సేవల సంచాలకులు, జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను సంసిద్ధత, అత్యవసర వైద్య సేవలు, మందుల నిల్వలు, అంబులెన్సుల అందుబాటు, గర్భిణుల తరలింపు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై సమీక్షించారు. తుపాను పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.