తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

-ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన అర్చకులు, టీటీడీ అధికారులు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకుని, అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం అందించింది.

అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తదితర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.