తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

-గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామివారు
-వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర వాహన సేవలో భారత ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారి వాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.
గరుడ వాహన సేవకు విశేష ప్రాధాన్యం

పౌరాణిక సంప్రదాయాల ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు విశేష ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనంపై స్వామివారు విహరించడం భక్తిలో శరణాగతి, దాస్యభావానికి ప్రతీకగా భావిస్తారు. జ్ఞానవైరాగ్యాలను ప్రసాదించే గరుడుని దర్శించడం వల్ల పాపాలు తొలగి, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ప్రముఖుల హాజరు

ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

అలాగే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ  సుబ్బారాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.