-లోపాలు గుర్తించిన 27,039 మందికి ఉన్నత స్థాయి వైద్య సేవలు
-ఆర్బీఎస్కే అమలుపై ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ సమీక్ష
-డిసెంబరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలని అధికారులకు సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద గడచిన మూడు నెలల్లో 27.54 లక్షల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరోగ్య సమస్యలు గుర్తించిన 27,039 మందికి తదుపరి చికిత్స కొనసాగుతోంది. అలాగే 541 మందికి పలు రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆర్బీయస్కే కింద రాష్ట్రంలోని రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో 18 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 53,66,466 మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం గత జులైలో ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన 27.54 లక్ష(51.32%)ల్లో 9,32,352 మందికి మరోమారు వైద్యాధికారులు నిర్ధారణ పరీక్షలు చేశారు. చివరిగా 27,039 మందిలో చికిత్సకు తగ్గ లోపాలున్నట్లు గుర్తించారు. వీరికి పెద్దాసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అమలు తీరుపై ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ గురువారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించి, డిసెంబరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు.
పుట్టుకతో వచ్చే లోపాలు 10, వ్యాధులు 5, పోషకాహార లోపాలు 11, ఎదుగుదలలో జాప్యం, వైకల్యాలకు సంబంధించిన సమస్యలు 12 కలిపి మొత్తం 38 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తున్నారు. నాడీ నాళాల లోపాలు 455, డౌన్ సిండ్రోమ్ 243, పెదవి, అంగిలి చీలికలు 153, క్లబ్‌ఫుట్ 142, తుంటి ఎముక సమస్యలు 102, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు 126, కంటిశుక్లం 83, వినికిడి లోపం 62, అకాల శిశువుల కంటి సమస్యలు 33, మూత్రపిండాలు, మూత్రనాళాల పుట్టుకతో వచ్చే లోపాల కింద 8 కేసులు నమోదయ్యాయి.
పోషకాహార లోపాలు, ఇతర వ్యాధులు
విటమిన్-ఎ లోపం 3,673, విటమిన్-డి లోపం 1,847, తీవ్రమైన పోషకాహార లోపం 715, రక్తహీనత 650, థైరాయిడ్ గ్రంథి వాపు 338 కేసులను గుర్తించారు. చర్మ సమస్యలు 5,122, రుమాటిక్ గుండె జబ్బులు 5,320, శ్వాస సంబంధ సమస్యలు 1,494, దంత సమస్యలు 1,141, మూర్ఛ 1,037, మధుమేహం 568, అధిక రక్తపోటు 311, మూత్రపిండాల వ్యాధులు 31, చెవి ఇన్ఫెక్షన్లు 69, క్షయ 12, కుష్ఠు విభాగంలో 9 కేసులను గుర్తించారు.
ఇతర సమస్యలు
కంటి చూపు సమస్యలు 236, వినికిడి లోపాలు 413, నరాల కదలిక సమస్యలు 246, కదలికల ఆలస్యం 181, మేధో వికాస సమస్యలు 61, భాషా వికాస సమస్యలు 45, ప్రవర్తనా సమస్యలు 27, ఆందోళన సమస్యలు 19, శ్రద్ధ లోపం, అతి చురుకుదనం 8, నిద్ర సమస్యలు 4, నాడీ వికాస సమస్యలు 35గా నమోదయ్యాయి. వీటితోపాటు ఆటిజం 15, అభ్యసన సమస్యలు 20, ఎదుగుదలలో తీవ్ర జాప్యం 2, పుట్టుకతో వచ్చే థైరాయిడ్ సమస్యలు 24, కౌమారదశకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు 157, మిగిలిన కేసులు తదుపరి పరీక్షల కోసం జిల్లా, బోధానాసుపత్రులకు పంపుతున్నారు. కొందరు ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. కొంతమందికి శస్త్రచికిత్సలు కూడా జరిగాయి.
