Breaking News

శాంతియుత నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం హేయం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి కలెక్టరేట్ కు బయలుదేరిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని శుక్రవారం పోలీసులు ఇంటివద్దనే అడ్డుకున్నారు. దీంతో లబ్బీపేటలోని తన నివాసం వద్దనే రైతులతో కలిసి రెండు గంటల పాటు ఆయన శాంతియుత నిరసన తెలియజేశారు. రైతాంగాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వారిని ఈ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వారం రోజుల క్రితమే అనుమతి కోరగా.. ఇప్పటివరకు పోలీస్ శాఖ స్పందించలేదన్నారు. అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలను కూడా కనీసం తెలియజేయలేదన్నారు. రైతులను అడ్డుకునేందుకు మాత్రం వందల మంది పోలీసులను ఈ ప్రభుత్వం పంపిస్తోందని దుయ్యబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? నిరంకుశత్వంలో ఉన్నామా..? అని ధ్వజమెత్తారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో అక్షరాల రూ. లక్షా 90 వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇస్తామన్న రూ. 20 వేల పెట్టుబడి సాయం కూడా ఇప్పటివరకు అందించలేదని విమర్శించారు. చివరకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులే డీఆర్సీ సమావేశంలో రైతాంగ సమస్యలపై గళం విప్పుతున్నా.. ప్రభుత్వంలో కనీస చలనం లేదని నిప్పులు చెరిగారు. వాట్సప్ లో హాయ్ అని సందేశాన్ని పంపిస్తే చాలు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్న మంత్రి ఏమయ్యారని విష్ణు ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులు 1061, 1262, 1318, 1224 రకాల వరిని సాగుచేయగా.. మిల్లర్లు 1061 రకం తప్ప మిగతా వాటిని కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి విత్తనాలు అందించడంతోనే రైతులు ఈ రకాలను పండించారని.. ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా పత్తికొండలో వ్యాపారులు కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ చెప్పడంతో.. రైతులు పంటను నేలపై పారబోసిన సంఘటన కలిచివేసిందన్నారు. అయినా కూడా రైతు కంట కన్నీరు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను ప్రభుత్వం అవమానిస్తోంది
వ్యవసాయంతోనే అభివృద్ధి జరిగిపోదంటూ రైతన్నలను ఈ ప్రభుత్వం అవమానిస్తోందని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల కన్నీళ్లకు సమాధానం చెప్పే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. గతంలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను చంద్రబాబు నిలువునా మోసగించారని విమర్శించారు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి వంచించడంతో.. అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. చివరకు గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన రూ. వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలు కూడా తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మించి సంక్షేమం అమలు చేస్తామని పదేపదే ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు.. తీరా అధికారంలోకి వచ్చాక సగం కూడా అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని.. ధాన్యానికి కనీస మద్ధతు ధర ఇవ్వాలని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను తొలగించాలని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని కోరారు. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, అన్నదాతకు అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేయాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం దిగివచ్చేవరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేశారు. మరోవైపు మూతపడిన ల్యాంకో పవర్‌ ప్లాంట్‌ హైటెన్షన్‌ ట్రాన్స్‌ మిషన్‌ టవర్ల మార్పిడి పేరుతో జక్కంపూడిలో రైతులు, ప్రజల ఆస్తులను ఛిన్నాభిన్నం చేస్తున్నారని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏ విధంగా వారి భూముల్లో తవ్వకాలు జరుపుతారని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, అలంపూర్ విజయలక్ష్మి, ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా, ఇసరపు దేవీ రాజారమేష్, బంకా భాస్కర్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీమ్, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *