Breaking News

సాహితీ పర్యాటకానికి బాటలు

-6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని పేర్కొన్న మంత్రి దుర్గేష్
తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి దుర్గేష్
రాష్ట్రంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్
గడిచిన ఐదేళ్లలో తెలుగు భాషను అన్యాయం చేసి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్
సరైన వ్యక్తిని తగిన స్థానంలో కూర్చోబెట్టారని మంత్రి దుర్గేష్ ను కొనియాడిన వక్తలు.. మంత్రి దుర్గేష్ ప్రసంగం పట్ల ముగ్దులైన ఆహుతులు, వక్తలు
18 తీర్మానాల కాపీని మంత్రి దుర్గేష్ కు అందించిన సభా నిర్వాహకులు, వక్తలు.. ఆచరణాత్మక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి దుర్గేష్
తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ఉండి తీరాల్సిందేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.ఆదివారం సాయంత్రం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగంలోకి అడుగుపెడుతూ దివంగతులైన ప్రముఖ కవుల ముఖచిత్రాలతో కూడిన చిత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు రెండు రోజుల పాటు దిగ్విజయంగా సాగాయని, తెలుగు నేల పులకరించిందని, తెలుగుదనం వెల్లివిరిసిందని సంతోషం వ్యక్తం చేశారు. మాతృభాషకు జవసత్వాలు నింపాలని నినదించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్న 18 తీర్మానాల కాపీని మంత్రి దుర్గేష్ కు అందించారు. తెలుగు పదాలను వెలికి తీసి ప్రాచుర్యం కల్పించాలి, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ పటిష్టత, ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం, అకాడమీల పటిష్టత, కళల పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి కోసం భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వం అందించేందుకు సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు, గ్రంథాలయాల బలోపేతం తదితర తీర్మానాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత ఆచరణాత్మక కార్యాచరణను సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. తదనుగుణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకారం తీసుకుందామన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సైతం ఏపీ ప్రతిపాదనలు స్వీకరించేందుకు సానుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో సాహితీ పర్యాటకం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. సాహిత్యం పరిఢవిల్లిన ప్రాంతాలను, గతించిన ప్రముఖ కవులు, రచయితల స్మారక మందిరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కళల పట్ల, భాషపై, భాషా వికాసంపై సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు,అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ తదితర వక్తల ప్రసంగాలు మనసును ఆకట్టుకున్నాయన్నారు.

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికలకు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పరితపించి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును, తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన చెరుకూరి రామోజీరావు పేర్లతో నామకరణం చేయడం సంతోషంగా ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి, పరభాషలో విద్యాబోధన జరిగిన దానికి తేడాను వివరించిన మంత్రి దుర్గేష్ ఆరోగ్యంలో తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చారు.

ప్రాథమిక స్థాయి విద్య తెలుగు మాధ్యమంలో ఉన్నత స్థాయి విద్య జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా త్రిభాష సూత్రంలో జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మాతృభాష ద్వారానే మానసిక వికాసం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

గడిచిన ఐదేళ్లలోని ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచే విధంగా, భాషా వికాసాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలు బాధను కలిగించాయని మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణంగా ఆంగ్ల మాధ్యమమే ఉండాలని తెలుగు ఔచిత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం సరికాదని భగవంతుడు సైతం వారికి ఎన్నికల్లో వ్యతిరేక తీర్పునిచ్చారని వివరించారు. ఈ క్రమంలో భాషకు పెద్దపీట వేసే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు.

తెలుగు రచయితల సభకు పత్రికల్లో వస్తున్న విస్తృత ప్రచారంతో తెలుగు జాతి చైతన్యమవుతుందని అందుకు కారణమైన మీడియా ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

భాష అంటే ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని, సమైక్యతను పెంచుతుందని, దేశాల మధ్య, సరిహద్దులు దాటిన సంస్కృతుల మధ్య అడ్డుగోడలను దాటి యావత్ జగతిని వసుధైక కుటుంబంగా తీర్చిదిద్దుతుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. మనుషుల మధ్య, మనసుల మధ్య సౌజన్యాన్ని నెలకొల్పే భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వందేళ్ల మనిషి ప్రస్థానం మాతృభాషతోనే శ్రీకారం చుడుతుందని మంత్రి అన్నారు. తెలుగు భాష రక్షణకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తోడ్పాటు ఉంటుందన్నారు. ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయన్నారు.

సామాన్య ప్రజానీకాన్ని సైతం కవితాధోరణిలో మాట్లాడించగల కమ్మనైన భాష మన తెలుగు అని, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలను దాటి నవల, కథ, కథానిక, గల్పిక, పద్యం, గేయం, కవితారూపాలుగా రూపాంతరం చెంది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా నిలిచిందన్నారు. అటువంటి తెలుగు భాష పరిపుష్టికి, ఔన్నత్యాన్ని చాటేందుకు తొలుత మన ఇంటి నుండే మార్పు ఆరంభం కావాలని సూచించారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు.

తెలుగు భాష వికాసానికి యువతరాన్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలుగు భాషా సాహిత్యాలను గురించి తెలపాల్సిన బాధ్యత మనమే తీసుకోవాల్నారు. అమ్మ భాషకు అందలం రావాలంటే ముందుగా ఆ భాషాభిమానం ప్రజల్లోనుండి రావాలని… అందుకు మనం జన చైతన్యం తీసుకురావాలన్నారు. జాతిని జాగృతపరిచేలా తెలుగు భాషను వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పెరుగుతున్న జనాభా వల్ల సంస్కృతి విస్తరించాలి, భాషా వికాసం పెంపొందాలి కానీ ఆంగ్ల భాషకు పెద్ద పీట వేస్తూ తెలుగును చిన్నచూపు చూడటం ఎవరికీ మంచిది కాదని గ్రహించాలన్నారు..ఈ క్రమంలో ప్రపంచ తెలుగు రచయితల సభలు నిర్వహించడం సంతోషమైన విషయమని మంత్రి తెలిపారు.. జీతం కోసం ఆంగ్ల భాష, జీవితం కోసం అమ్మభాష అని తెలుసుకోవాలన్నారు.

కార్యక్రమంలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు,అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, కవులు, రచయితలు, భాషాభిమానులు, సాహితీ ప్రముఖులు, సినీ, రాజకీయ, న్యాయ, ప్రభుత్వ రంగాల నుండి విచ్చేసిన వ్యక్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *