-సుబ్బారావు కాలనీ వాసులతో ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రోజుల్లో విజయవాడ నగరం మరింతగా విస్తరణ కాబోతుందని, దాని సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లో సుబ్బారావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా అసోసియేషన్స్ సభ్యులు కాలనీలోని రోడ్ల సమస్యతో పాటు మరికొన్ని సమస్యలు ఎంపి కేశినేని శివనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ కారణంగా రోడ్లు పాడయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ముందుగా ఎస్.టి.పిలు, రోడ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఆరునెలల్లో నగరంలో గుంతలు లేని రోడ్లను చూస్తారన్నారు. అలాగే ఏడాదిలో డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ సమస్యను ఒక కొలిక్కితీసుకురావటానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.కాలనీవాసులు కోరుకునే విధంగా వారి కాలనీలు వుంటాయన్నారు. కాలనీ వాసులంతా కలిసి చేపట్టే నిర్మాణం కాలనీకి ఆర్ధికంగా ఉపయోగపడేదిగా వుండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అందరూ ఏ సమస్యనైనా మానవీయ కోణం చూడాలన్నారు. విజయవాడను గ్రేటర్ విజయవాడ చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక అని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో చిరు వ్యాపారుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు,దేవినేని అపర్ణ, కాలనీ అధ్యక్షుడు పర్వతనేని రామచంద్ర, సెక్రటరీ రాజారావు, కోశాధికారి వెలగపూడి సుబ్బారావులతోపాటు అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు