-ఉల్లంగుల ఏడుకొండలుకు ఎయిర్ కంప్రెషర్ అందజేసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట, నేటి పత్రిక ప్రజావార్త :
యల్లమంద గ్రామ వాస్తవ్యులు ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సందర్శించి ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటివద్దే పింఛను అందజేసి, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా కాఫీ తయారు చేసి మరీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల చెక్కును ప్రజా వేదిక వద్దే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పటికప్పుడే అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో తమ ఇంటికి వెలుగొచ్చిందని, హామీలు అమలు చేసి ఆ వెలుగు కలకాలం నిలిచేలా చేశారని ఏడుకొండలు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావు పేట ఆర్డీవో మధులత, తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.