-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఉన్న మరుగుదొడ్లలన్నిటిలోనూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం తన పర్యటనలో భాగంగా పటమట, బందర్ రోడ్డు, వారధి, నేషనల్ హైవే, లబ్బీపేట వాటర్ ట్యాంక్, ఆర్టీసీ లేబర్ కాలనీ, నైజాం గేట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్బీపేట లోని వాటర్ ట్యాంక్, గవర్నర్పేట వద్ద గల మరుగుదొడ్లను కమిషనర్ పరిశీలించి నగరపాలక సంస్థ సంబంధిత మరుగుదొడ్లు అన్నిటిలోనూ ఎటువంటి మరమ్మత్తులు ఉండకుండా చూసుకోవాలని, పరిశుభ్రంగా ఉంచుతూ నిత్యం పర్యవేక్షిస్తుండాలని అన్నారు. నగరం పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అధికారులందరూ పర్యవేక్షిస్తూ చెత్త సేకరణ నిత్యం జరిగేటట్టు చూసుకోవాలని అన్నారు.
44వ డివిజన్లో, ఆర్టీసీ లేబర్ కాలనీలో గల ఔట్ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు, త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 55వ డివిజన్లో గల నైజాం గేటు వద్ద గల ఔట్ ఫర్ డ్రైన్ ను పరిశీలించి రైల్వే వారి సమన్వయంతో ఔట్ఫాల్ట్ డ్రైన్ నిర్మించాలని అన్నారు. విశాలాంధ్ర రోడ్డు వద్ద గల సెంట్రల్ డివైడర్ను పరిశీలించి నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో డివైడర్ ఎత్తును పెంచి, డివైడర్ లో పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణం లోని కాలుష్య శాతాన్ని తగ్గించే విధంగా, అవకాశం ఉన్న ప్రతి చోట పచ్చదనాన్ని పెంచాలని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్చార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.