మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, పశుసంవర్ధక, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖాధికారులతో కోడి పందేల నిర్వహణ నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందేలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులతో కూడిన డివిజన్, మండల, గ్రామ స్థాయి టీములను ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించకుండా నిలువరించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని అన్నారు.
కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కోడి పందేలు నిర్వహించినట్లు తెలిసిన ప్రాంతాలలో 144 సెక్షన్ విధించాలని చెబుతూ ఆదేశాలు అతిక్రమించిన వారిపై సెక్షన్ 10 ఏపి గేమింగ్ యాక్ట్ 1974, అదేవిధంగా సెక్షన్ 34 జంతుహింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బెట్టింగులు, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని చెప్పారు. గత సంవత్సరంలో కోడి పందేలు నిర్వహించిన వారిని, కత్తులు కట్టే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. కోడి పందేల నిర్వహణ నిషేధంపై గ్రామాలలో టాం టాం వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, జడ్పీ సీఈవో కన్నమనాయుడు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మార్కెటింగ్ ఎడి నిత్యానంద, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.