-కలంకారీ క్లస్టర్ ఏర్పాటుతో పదివేల కుటుంబాలకు లబ్ధి….
-క్లస్టర్ ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలన…… జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కలంకారి క్లస్టర్ ఏర్పాటుతో పెడన కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావటం తో పాటు, ఆ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోని పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ ,పరిశ్రమలు, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
పెడనలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆనుకునివున్న స్థలంతో పాటు, కంపోస్ట్ యార్డ్ సైట్ ను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ క్లస్టర్ ఏర్పాటుకు సుమారు 7 ఎకరాల స్థల విస్తీర్ణం అవసరం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుతో కలంకారీ రంగంలో మెరుగైన ఉత్పాదకత సామర్థ్యం, నాణ్యత, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించుకోవడంతో ఈ రంగంలో కళాకారులకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కలంకారి క్లస్టర్ దోహదపడుతుందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. స్థల పరిశీలనలో కలెక్టర్ తో పాటు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, మచిలీపట్నం ఆర్డిఓ కే.స్వాతి, మున్సిపల్ కమిషనర్ ఎం. గోపాలరావు, తహసిల్దార్ కే. అనిల్ కుమార్ ఉన్నారు.