మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తక పఠనం ప్రతి ఒక్కరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఆ అనుభూతుని ఆస్వాదించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెండు బీరువాలతో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
పండుగలు, ముఖ్యమైన సందర్భాలలో తనను కలవడానికి వచ్చినప్పుడు పుష్పగుచ్చాలు, మొక్కలు, స్వీట్స్, శాలువలకు బదులుగా ఉపయోగపడే మంచి పుస్తకాలను కానుకగా అందించాలని, తద్వారా వాటిని అవసరమైన వారు చదువుకునేందుకు వీలుగా భద్రపరచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే రాత పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు, ప్లేట్లు, స్కేళ్ళు తదితర విద్య సంబంధ ఉపకారణలను అందించాలని వాటిని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అందించటం జరుగుతుందన్నారు.
తాను ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను ఎంతో ఆసక్తిగా చదువుతానని, చదువుకునే రోజుల్లో సైతం పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించేవాడినని నాటి సంగతులను కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులతో పంచుకున్నారు. ఇప్పటివరకు వివిధ రకాలైన 286 పుస్తకాలు అధికారుల నుంచి రాగ, వాటన్నిటిని ప్రత్యేకమైన బీరువాల్లో భద్రపరిచారు. అందుబాటులో ఉన్న పుస్తకాలను చదువుకోదలిచినవారు అక్కడే చదువుకుని మరల అక్కడ ఉన్న సిబ్బందికి అందించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అధికారులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిడి విజయలక్ష్మి, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.