Breaking News

అదానీతో ఒప్పందాల అంశాలపై సిఎం చంద్రబాబు

-అమెరికా నివేదికకై ఎదురుచూడడం విడ్డూరం
-కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి గోదావరి`కృష్ణా`పెన్నా ప్రాజెక్టులా?
-విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన నిర్ణయం వెల్లడిరచాలి
-ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనలో నల్లజెండాలతో నిరసనలు
-విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి: అదానీ కంపెనీలతో విద్యుత్‌ ఒప్పందాలపై జరిగిన అవినీతి వ్యవహారంపై అమెరికా ప్రభుత్వ తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ‘ఈ కేసు నాకు లడ్డూ మాదిరిగా దొరికిందని మీరు అనుకోవచ్చని, కానీ నాకు విశ్వసనీయత ముఖ్యమని, రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బందిపడాల్సి ఉందని, అందుకే తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామంటూ’ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం తగదని రామకృష్ణ ఖండిరచారు.
విజయవాడ దాసరి భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు సెకీతో ఒప్పందం జరగడం వల్ల అదానీకి, గత ప్రభుత్వంలోని పెద్దలకు రూ.1750కోట్ల లంచాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయని పునరుద్ఘాటించారు. సీనియర్‌ సీఎంగా ఉన్న చంద్రబాబు..ప్రజలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వైపుగా ఆలోచించడం లేదన్నారు. ఎంతసేపూ మాజీ సీఎం జగన్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఆరోపించడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు అనుకుంటే జగన్‌ను అరెస్టు చేయగలననే ఆలోచన ఇక్కడ కాదని, అసలు సమస్య ఏమిటంటే 2021లో సెకీతో 7వేల మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందాలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇదే సోలార్‌ ఒప్పందాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఎన్టీపీసీతో చేసుకుందని, అక్కడి ప్రభుత్వం రూ.1.99 పైసలకు చేసుకుంటే, ఇక్కడ రూ.2.49పైసలకు చేసుకున్నారని, అదీ 25 ఏళ్లపాటు అగ్రిమెంట్‌ అని వివరించారు. దాదాపు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని విద్యుత్‌ వినియోగదారులపై… రానున్న 25 ఏళ్లలో లక్షా 10వేల కోట్ల విద్యుత్‌ భారం అదనంగా పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై పడుతున్న భారం తగ్గించే దానిపైన, రాష్ట్ర ప్రయోజనాలపైన చంద్రబాబు మాట్లాడక పోవడం దురదృష్టకరమని అన్నారు. దానిపై ఒక నిర్ణయం తీసుకోకుండా..జగన్‌ నాకు లడ్డూ మాదిరిగా దొరికారంటూ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించడం తగదని, దీనిని సీపీఐ తరపున తీవ్రంగా ఖండిరచారు. సోలార్‌ను రాజస్థాన్‌ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోండడం వల్ల అక్కడి ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పన్నుల రూపంలో వస్తున్నాయని వివరించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన ఉందని, భూములిచ్చిన రైతులకు 30 ఏళ్లపాటు లీజు అగ్రిమెంట్‌ ఉంటుందన్నారు. మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే, దానిపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సోలార్‌ వల్ల అమెరికా ప్రభుత్వానికి ఏమైనా నష్టమా?, అమెరికాలో ఉన్న కంపెనీలు దివాళా తీస్తాయా?, అమెరికా ప్రజలపై భారం పడుతుందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించడంలేదని, జగన్‌ను ఒక ప్రత్యర్థిగానే చూస్తున్నావని, ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆదానీతో చేసుకున్న ఒప్పందాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గంగవరం, కృష్ణపట్నం పోర్టులను కూడా అప్పనంగా అదానికి అప్పగించారన్నారు. పొరుగునున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌..అదానితో జరిగిన ఒప్పందాలను రద్దుచేశారని, స్టాలిన్‌ను అభినందిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తే.. ఇక్కడ పోలీసు విభాగం ఎందుకు?, మీ ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.

కార్పొరేట్ల చేతుల్లోకి నీటిపారుదల ప్రాజెక్టులా?
గోదావరి`కృష్ణా`పెన్నా నదుల అనుసంధానం కోసం రూ.80వేల కోట్ల ఖర్చు అవుతుందని, దాన్ని కార్పొరేట్‌ సంస్థకు కట్టబెడతామని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. మన దగ్గర ఉన్న సహజ వనరుల్లో భూమి, నీరు ముఖ్యమైనవని వివరించారు. రాష్ట్రంలో బలమైన సంపద గోదావరి నది, దాని ద్వారా దాదాపు 4వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, ఆయా నీటి వినియోగానికి కార్పొరేట్‌ సంస్థలకు పెత్తనం ఇస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం తగదన్నారు. జాతీయ రహదారులకు టోల్‌గేట్లు అప్పగించిన తరహాగానే, గోదావరి`కృష్ణా`పెన్నా నదుల అనుసంధానంలోనూ ప్రైవేట్‌ వారికి పెత్తనం ఇస్తారన్నారు. ఈ తరహా నిర్ణయం అత్యంత ప్రమాదకరమైన ఆలోచనని, రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద సంపదను కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టి, వారి నిర్ణయాల ప్రకారం మనమంతా ఆధారపడాల్సి ఉంటుందన్నారు. త్రాగునీరు నుంచి, సాగునీరు వరకూ అమ్మకాలు సాగుతాయని, నీటి వినియోగం కోసం కూడా ప్రైవేటు వారిపైనే ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్దఎత్తున ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవాలేగానీ, నీటి ప్రాజెక్టులను కార్పొరేట్‌ చేతుల్లో పెడతామనే ఆలోచన సరికాదన్నారు.

విశాఖ స్టీల్‌ను వదలి మిట్టల్‌కు వత్తాసా?
విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలోనూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దీన్ని ప్రైవేట్‌పరం కాకుండా చూడాల్సిన బాధ్యత నాటి ముఖ్యమంత్రి జగన్‌దేనంటూ లేఖ రాశారని గుర్తుచేశారు. అవసరమైతే నాడు టీడీపీ ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేస్తారని ప్రకటించారన్నారు. నేడు అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మిట్టల్‌ కంపెనీ గురించి మాట్లాడుతున్నారని, విశాఖ స్టీల్‌ ప్రస్తావనే తేవడం లేదని చెప్పారు. మిట్టల్‌ కంపెనీకి భూములు, మైన్స్‌ కేటాయింపులపైనే సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీకి మైన్స్‌ ఇస్తే.. బ్రహ్మాండంగా అభివృద్ధికి చెందుతుందన్నారన్నారు. పైగా నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు కార్మికులకు వేతనాలను నిలిపివేశారన్నారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని రద్దుచేసి, మిట్టల్‌ కంపెనీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోల్పోతే నేడు అధికార, ప్రతిపక్షంలో ఉన్న వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా స్పందించాలని సూచించారు. బియ్యంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వాళ్లు డబ్బులు కట్టినప్పటికీ..మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారని, అదే అదానీ కంపెనీల అవినీతిపై ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారని మండిపడ్డారు. నాడు ఎమ్మెల్యేలాంటి పదవి లేనప్పుడే పవన్‌ కల్యాణ్‌ మాట్లాడేవారని, ఇప్పుడెందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. అదానీ కంపెనీతో ఒప్పందాల అవినీతిపైన, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా సీఎం చంద్రబాబు, పవన్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.
ఈనెల 4వ తేదీన సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన ప్రకటన రాకపోతే…ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ పర్యటనలో నల్ల జెండాలతో నిరసనలకు దిగుతామని ప్రకటించారు. ఇప్పటికైనా అదానీ అవినీతిపైన, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పైన, కృష్ణా`గోదావరి`పెన్నా నదుల అనుసంధానంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవానీ, విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్సన్‌బాబు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *