Breaking News

సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సదరం సర్టిఫికేట్ల జారీలో అవకతవకలు జరిగాయనే నేపథ్యంలో ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు రీవెరిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని, కొత్తగా ఇచ్చే సదరం సర్టిఫికెట్లలో అక్రమాలకు పాల్పడితే తప్పక సంబంధిత వైద్య అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు.

గురువారం సాయంత్రం సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ పై,దీర్ఘ కాలిక వ్యాధులతో మంచానికే పరిమితమై 15 వేల రూపాయల పెన్షన్ పొందుతున్న పేషంట్ల వివరాలపై, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను పొందుతున్న వాటిపై తనిఖీ మార్గదర్శకాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో, పిడి వెలుగు, డిఎంహెచ్ ఓ, డిసిహెచ్ఎస్ తదితర జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు సంబంధిత కార్యదర్శులతో కలిసి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందే వారిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని కృష్ణ బాబు తెలిపారు. అందులో భాగంగా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఇందుకోసం వైద్య బృందాలను నియమిస్తామన్నారు. సధరమ్ ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పరిశీలన కొరకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విషయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ట్యాంపరింగ్ వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకంగా నియమించిన వైద్య బృందాలకు సహాయ సహకారాలు అందించడానికి సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లను నియమించాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించాలని, వారి ఆరోగ్య వివరాలను సంబంధిత వైద్యాధికారులు తక్షణమే యాప్ లో నమోదు చేయాలన్నారు. సోమవారం నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించాలని, విచారణకు సంబంధించిన మార్గదర్శకాలు పంపుతామన్నారు. నూరు శాతం నిక్కచ్చిగా పరిశీలన, విచారణ ప్రక్రియ జరుగుతుందన్నారు. బృందాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరిస్తూ ఎక్కువ సదరం విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ల సర్టిఫికెట్లు మంజూరు చేసిన ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని సూచించారు.

విసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్లపై పెన్షన్ పొందుతున్న వారిలో మొదటి దశలో మంచానికే పరిమితం అయిన వారి గృహాలను స్పెషలిస్ట్ డాక్టర్, డిజిటల్ అసిస్టెంట్, పిహెచ్సి వైద్యుల బృందం సందర్శన చేసి ప్రభుత్వం నుండి రూపొందించబడిన యాప్ నందు వారి ఆరోగ్య వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందనీ, ఈ నెలాఖరులోపు సదరు మంచానికి పరిమితమైన దీర్ఘ కాలిక రోగాల పేషంట్లకు సంబంధించిన పెన్షన్ల రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. తదుపరి దశలో ఇతర డిజెబిలిటీ పెన్షన్లు పొందుతున్న వారి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రణాళికలు సిద్ధం చేసి తేదీలు, గ్రామాలు, ఆసుపత్రుల అనుసంధానంతో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. సదరు అంశాల నివేదిక ఏప్రిల్ మాసంలోపు పూర్తిచేసేలా ప్రణాళిక ఉండాలని తెలిపారు. సదరం సర్టిఫికెట్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ చాలా పకడ్బందీగా చేపట్టాల్సి ఉంటుందని ఎలాంటి అక్రమాలకు చోటు ఉండరాదని, కొత్తగా బోగస్ సదరం సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో పథక సంచాలకులు వెలుగు శోభన్ బాబు, డిప్యూటీ సీఈవో జుబేదా జిల్లా పరిషత్, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *