-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘టీచింగ్ అనేది ఒక వృత్తి మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. భవిష్యత్తు తరాల కోసం స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకత్వం అందించే బాధ్యత’ అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. గురువారం (2025 జనవరి 2న) విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం YesJ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లో ఆరు రోజుల కేజీబీవీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ కేజీబీవీ టీచర్లు బాలికల జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు బాలికల భద్రతకు, నాణ్యమైన విద్యకు కృషి చేస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఈ శిక్షణా సదస్సు నుండి పాఠ్య పద్ధతులను, ఇతర అంశాలను నేర్చుకుని కేజీబీవీల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.
కేజీబీవీ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థినుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యం, సంక్షేమం, విద్యకు సమన్వయంగా ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం కేజీబీవీల్లో చదువుతున్న బాలికల భవిష్యత్తు జీవితం ఉన్నతంగా ఉండేలా ఉపయోగపడుతుందని కాంక్షించారు. దీనికోసం విద్యార్థుల అకడమిక్ ప్రావీణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులు కొత్త బోధన విధానాలను ఆచరణలోకి తీసుకురావాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి, ఇగ్నస్ పహల్ వ్యవస్థాపకులు సుబీర్ శుక్లా, ఎల్ఎఫ్ఈ ప్రతినిధి సిద్ధేశ్ తదితరులు పాల్గొన్నారు.