-సి. సావిత్రి, ఛైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రజకులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ సి. సావిత్రి తెలిపారు. గొల్లపూడి బీసీ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చైర్ పర్సన్ సి. సావిత్రి మాట్లాడుతూ రజకులకు ఈ రోజు సుధినమని దానికి కారణం ఎంపికైన 15 మంది డైరెక్టర్ల చేత ఛైర్ పర్సన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయించడమేనన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. మా అందిరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ, అభివృద్ధి ఫలాలు రజకులకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొస్తానన్నారు. అంతేకాకుండా రజకుల సంక్షేమానికి, ఉపాధికి సంబంధించి ఉన్న జీవోలను ప్రభుత్వం అమలు చేసి వారిని వృత్తి పరంగా మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో బట్టలు ఉతికే పనిని రజకులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీని కోసం ఉన్న జీవోలను పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని అభివృద్ధి ఫలాలు రజకులకు చేరితే ఆ జాతి అభివృద్ధి బాట లో పయనిస్తుందన్నారు. రజకుల స్థలాల్లో లాండ్రీ షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రజకుల కులస్తులకు కూటమి సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రజక కుల వృత్తులకు చెందిన పనిముట్లు వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిట్ట చివరి రజక బిడ్డ వరకు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానన్నారు.
శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అధివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. బీసీ లతో మమేకమైన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, అనేక సంక్షేమ పథకాల ద్వారా బీసీ లను ఉన్నత స్థాయికి ముఖ్యమంత్రి చేర్చారన్నారు. 2014-19 మధ్య రజకులకు రజక భవనాలతోపాటు అనేక సంక్షేమ ఫలాలను ముఖ్యమంత్రి అందించారన్నారు. బీసీలకు రూ. 39,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించారన్నారు. 2019 లో వచ్చిన ప్రభుత్వం బీసీ ల అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు.
శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి నా శుభాకాంక్షలన్నారు. కార్పొరేషన్ లకు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. నా వంతుగా రజకుల హక్కుల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రజకుల అభివృద్ధి కి ప్రతి ఒక్క డైరెక్టర్ ఖచ్చితంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పదవికి వన్నె తీసుకురావాలన్నారు.
తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్ పర్సన్ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి రజక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.