Breaking News

విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌న ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

– రైల్వేతో ముడిప‌డిన అంశాల్లో పురోగ‌తిపై నిరంత‌ర స‌మీక్ష‌
– ఉమ్మ‌డి త‌నిఖీల ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయండి
– డీపీఆర్‌లు, ప్ర‌తిపాద‌న‌ల రూప‌క‌ల్ప‌న ప్ర‌క్రియ కీల‌కం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక చొర‌వ చూపాల‌ని, ఇందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జిల్లాలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నులు, భ‌విష్య‌త్తు ప్రాజెక్టులు, వాటిని చేప‌ట్టే స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, రెవెన్యూ, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, ఎన్‌హెచ్ఏఐ, జ‌ల వ‌న‌రుల అభివృద్ధి, డ్రెయిన్లు, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. శాఖ‌ల వారీగా మంజూరైన ప‌నులు, వాటిలో పురోగ‌తి, భ‌విష్య‌త్తులో చేప‌ట్టే ప‌నులు త‌దిత‌రాల‌పై స‌మీక్షించారు. వివిధ ప‌నుల‌కు సంబంధించి స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక‌ల‌ను (డీపీఆర్‌) త్వ‌రిత‌గ‌తిన రూపొందించాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఉమ్మ‌డి త‌నిఖీల ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్నారు. రైల్వేతో సంబంధ‌మున్న ప‌నుల పూర్తికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. అమృత్ భార‌త్ ప‌థ‌కం కింద నిధులు మంజూరు త‌దిత‌రాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. గుణ‌ద‌ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జ్‌, సింగ్‌న‌గ‌ర్ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జ్‌, వాంబే కాల‌నీ వ‌ద్ద డ‌బుల్ లైన్ రైల్వే అండ‌ర్ బ్రిడ్జ్‌, మ‌ధురాన‌గ‌ర్ ప‌ప్పుల మిల్లు వ‌ద్ద డ‌బుల్ లైన్ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జ్ త‌దిత‌రాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. తిరువూరు ప‌ట్ట‌ణంలోని అంత‌ర్గ‌త ర‌హ‌దారుల మ‌రమ్మ‌తుల ప‌నులపైనా చ‌ర్చించి, సాంకేతిక అంశాల ప‌రిష్కారానికి త‌గిన చొర‌వ చూపాల‌న్నారు. జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ ప‌ట్ట‌ణాలకు తాగునీటి స‌ర‌ఫ‌రాతో వివిధ తాగునీటి ప‌థ‌కాల‌కు సంబంధించిన మ‌ర‌మ్మ‌తుల‌పైనా దృష్టిపెట్టాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు, డీపీఆర్‌లు రూపొందించాల‌ని గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా అధికారుల‌కు సూచించారు. అదేవిధంగా వెల‌గ‌లేరు వ‌ద్ద హెడ్ రెగ్యులేట‌రీ గేట్స్ రీప్లేస్‌మెంట్‌, జి.కొండూరు తార‌క‌రామ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి మోటార్లు స‌మ‌కూర్చే అంశంపైనా ఇరిగేష‌న్ అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.
స‌మావేశంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీ న‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో కె.చైత‌న్య‌, సీపీవో వై.శ్రీల‌త‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు రైల్వే, ఆర్ అండ్ బీ, జాతీయ ర‌హ‌దారులు, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *