-దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
-ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇంధన శాఖా మంత్రి గొట్టి పాటి రవికుమార్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ, క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ , ఏపీ జెన్కో ఎండీ కె .వి.యన్.చక్రధర్ బాబుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విజనరీ లీడర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు, విద్యుత్ సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న AP GENCO, AP Transco కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తమ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేసిందని, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకబోతుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం AP – Integrated Clean Energy Policy – 2024 తీసుకుని వచ్చి దీని ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో AP Transco రూ.15,729 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తుందని, దీని ద్వారా 71 సబ్ స్టేషన్లు, 16,507 ఎంవీఏ ట్రాస్ఫర్మేషన్ సామర్థ్యం, 4696 సీకేఎం టాన్స్మిషన్ లైన్స్ ను జోడిస్తుందన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల (పి.ఎస్.పి.) రంగంలోకి ఏపీ జెన్కో అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో సొంతంగా పి.ఎస్.పి. నిర్మించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీక్ లోడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా 5000 మెగావాట్ల సామర్థ్యంతో సంయుక్త భాగస్వామ్యంలో అయిదు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పి.ఎస్.పి.లు) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్.హెచ్.పి.సి. తో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యూ.) కుదుర్చుకోవడం ఏపీ విద్యుత్ రంగంలోనే కీలక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అంకితభావం, నిబద్ధతను కనబరుస్తూ.. ఆంధ్రప్రదేశ్ ను విద్యుతాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని.. ఈ క్రతువులో మీ భాగస్వామం కీలకమని తాను నమ్ముతున్నానని,
AP Transco, AP GENCO పేరు ప్రతిష్టలు దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేసేలా ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తి గతంగా, సమిష్టి గా అంకిత భావంతో కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త ఏడాది సందర్భంగా విద్యుత్ సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీట్రాన్స్కో డైరెక్టర్ ఏకేవీ భాస్కర్, ఏపీజెన్కో డైరెక్టర్ హైడెల్ / ఎఫ్ఏసి ఎం.సుజయ్ కుమార్, డైరెక్టర్ థర్మల్/ఎఫ్ఏసి పి. అశోక్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ హెచ్ఆర్/ఎఫ్ఏసి పి నవీన్ గౌతమ్, ఏపీట్రాన్స్కో, ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్లు, సీజీఎం లు పాల్గొన్నారు.