అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
1.భీమా వైద్య సేవల శాఖ (లైఫ్ ఫౌండేషన్ బ్యూరో & ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ – LFB&IMS)
-తిరుపతి జిల్లా తిరుపతిలోని ESI ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు రూ.7,44,08,373/- అంచనా వ్యయంతో అప్-గ్రేడేషన్ చేయడానికి మరియు అదనంగా అవసరమైన (191) మంది వైద్య మరియు పారా మెడికల్ సిబ్బంది క్యాడర్ స్ట్రెంత్ మంజూరుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ఈ మొత్తం వ్యయాన్ని 7:1 నిష్పత్తిలో ఇఎస్ఐ కార్పొరేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. ఇందులో రూ.6,51,07,356/- ను ఇఎస్ఐ కార్పొరేషన్ మరియు రూ.93,01,047/- లను రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా నిధులను సమకూర్చనున్నాయి.
-50 పడకల ఈఎస్ఐ వైద్యశాలను 100 పడకలుగా అప్ గ్రేడేషన్ చేయడం వల్ల ఈ ప్రాంతంలోని కార్మికులకు అధిక ప్రయోజనం చేకూరనుంది.
2.పురపాలక & పట్టణాభివృద్ది శాఖ….
-రాజధాని అమరావతిలో రూ.2,723.02 కోట్ల విలువైన రెండు (2) ఇంజినీరింగ్ పనుల ఆమోదానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-గత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ అమరావతి అభివృద్ది పనులను నిర్లక్ష్యం చేయడం జరిగింది
-కానీ ఈ ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధానిని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో పలు చర్యలు చేపట్టడం జరిగింది.
-వరల్డు బ్యాంక్, హడ్కో, జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్సు తో అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది
-ఆయా సంస్థల సూచనల మేరకు ప్రెష్ టెండర్లను పిలిచేందుకు చర్యలు చేపట్టడం జరిగింది
3.పురపాలక & పట్టణాభివృద్ది శాఖ….
-ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డవలప్మెంట్ అథారిటీస్ (AP MRUDA) చట్టం 2016 కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ఈ MRUDA చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్ మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.
4.ప్రణాళికా శాఖ….
-కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) లో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత మెరుగ్గా అమలు చేసేందుకు అవసరమైన (19) పోస్టుల మంజూరీకై చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5.ఇంధన శాఖ….
-గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు కూడా ఋణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం జరిగింది.
-అయితే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టేందుకు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు
-ఇందులో భాగంగా 1.0 MMTPA గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా తయారీ సామర్థ్యం గల M/s. ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా (ఇండియా) ప్రైవేట్ లిమిలెడ్ (AMGA) ను కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-గ్రీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ఈ ప్రాజక్టుకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది
-స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెల్పింది
6.ఇంధన శాఖ….
-దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా సోలార్, విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నది
-M/s. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు YSR జిల్లాలకు 119 MW పవన మరియు 130 MW (195 MWp) సోలార్ హైబ్రిడ్ ఇంధనంతో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
7.ఇంధన శాఖ….
-M/s. జాన్ కాకెరిల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి, తద్వారా 2 గిగావాట్ (GW) ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8.ఇంధన శాఖ….
-కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హులిటి గ్రామాలలో M/s. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-దీనికి కాలసిన భూముని టాటా పవర్స్ సమకూర్చు కుంటుంది, ప్రభుత్వ పరంగా ఈ సంస్థకు ఎటు వంటి భూమి ఇవ్వడం లేదు
-ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2 వేల కోట్ల పెట్టు బడులు రాష్ట్రానికి రానున్నాయి. అదే విధంగా 1,380 మందికి ఉద్యోగ అవకశాలు కలుగనున్నాయి
9.ఇంధన శాఖ….
-దేశంలోని పలు రాష్ట్రాలు కంప్రెస్టు బయోగ్యాస్ ప్లాంట్లను తమ తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ పై వత్తిడి తెచ్చినప్పటికీ, ఆ సంస్థ మాత్రం మన రాష్ట్రంలోనే దాదాపు 500 యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.
-M/s. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా లీజు ప్రాతిపదికన వివిధ జిల్లాల్లో మొత్తం 11,000 MT సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-తద్వారా రూ.65 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటు 2.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
-ఇప్పటి వరకూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చిండం జరుచున్నది. అయితే మన రాష్ట్రంలో దీనికి అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మన ప్రభుత్వ చర్యలు ద్వారా నిరూపించడం జరుగుచున్నది.
-తే.12.11.2024 దీన రిలయన్సు ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో ఎం.ఓ.యు. చేసుకుని, కేవలం నెలా పదిహేను రోజుల్లోనే తమకు కావల్సిన భూములను కేటాయించాలన కోరుతూ, అడ్వాన్సు పొజిషన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కోరడం జరిగింది.
-రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములను ఎకరానికి రూ.15000/- చొప్పున లీజు ప్రాతిపదికన తమ కేటాయించాలని రిలయన్సు కంపెనీ కోరడం జరిగింది
-ప్రభుత్వం కేటాయించే భూములు చాలని పక్షంలో రైతుల నుండే ఆ సంస్థ నేరుగా సమకూర్చుకునేందుకు మరియు ఎకరానికి రూ.30 వేలు చెల్లించేందుకు సిద్దంగా ఉంది.
-800 యూనిట్లకు ప్రతిపాదించినప్పటికీ తొలి దశలో 500 యూనిట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చింది
10.రెవిన్యూ శాఖ….
-చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లె గ్రామంలోని LPM నెం.1435లో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని షరతులకు లోబడి ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోం శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11.రెవిన్యూ శాఖ….
-గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ESI ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం Sy.No.110- 02లో 6.35 ఎకరాల భూమిని డైరెక్టర్ జనరల్, ESI హాస్పిటల్, న్యూడిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
12.రెవిన్యూ శాఖ….
-గత ప్రభుత్వం జారీ చేసిన GOMs No.18 Rev(ల్యాండ్స్-VI) డిపార్టుమెంట్, తే.29.01.2020 దీని ఉపసంహరిస్తూ వైఎస్ఆర్ జిల్లా కడప మండలం అక్కయ్యపల్లి గ్రామంలోని సర్వే నెం.37/4లో 2.00 ఎకరాల భూమిని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-గతంలో టిడిపి కార్యాలయానికి మంజూరు చేసిన ఈ భూమిని గత ప్రభుత్వం రద్దుచేసింది.
-తిరిగి ఆ జీఓను రద్దు చేస్తూ తిరిగి టిడిపికి కేటాయిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది
13.పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ (I&C)….
-రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు M/s TCS, M/s. Azad India Mobility Limited మరియు M/s. Balaji Action Buildwell Pvt Ltd. సంస్థల కోసం చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-తే.30.12.2024 దీన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పారా (2.4) ప్రకారం, వివిధ విధానాలు మరియు కొన్ని విధాన సంబంధిత సమస్యల కింద మెగా ప్రాజక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని అందజేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది.
-విశాఖలో 10 వేల మందితో టిసిఎస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
-ఇందుకు ఏపిఐఐసికి చెందిన మిలీనియం టవర్స్ ఏ & బి బ్లాకుల్లో 2.08 లక్షల స్వేర్ ఫీట్ ఏరియాను కేటాయించడం జరిగింది.
-బస్సుల బాడీ బిల్డింగ్ చేసే M/s. Azad India Mobility Limited రూ.1046 వేల కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాల్లో ఒక యూనిట్ ను మూడు దశల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
-ఈ ప్రాజెక్టు ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. 70.7 ఎకరాలను మూదు దశల్లో ఎకరానికి రూ.38.37 లక్షల ధరకు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-అనకాపల్లి జిల్లాలో 106.27 ఎకరాల్లో రూ.1,174 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఉడ్ కు సంబందించిన ప్యాక్టరీని స్థాపించేందుకు M/s. Balaji Action Buildwell Pvt Ltd.కు మంత్రి మండలి ఆమోదం తెల్పింది
14.పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ (I&C)….
-M/s భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సంస్థచే నెల్లూరు జిల్లా రామయ్యపట్నం పోర్టు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్సెను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-తే.30.12.2024 దీన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పారా (2.4) ప్రకారం, వివిధ విధానాలు మరియు కొన్ని విధాన సంబంధిత సమస్యల కింద మెగా ప్రాజక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని అందజేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది.
-దాదాపు 6 వేల ఎకరాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించడం జరిగింది
-ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.96 వేల కోట్ల మేర పెట్టు బడులు పెట్టడం జరుతుంది
-చమురు శుద్ది, పెట్రోకెమికల్స్ రంగంలో అంతర్జాతీయ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్ది సంబందిత రంగాల్లో గ్లోబల్ వేల్యూ చైన్ తో అనుసంధానం చేసి, నాణ్యమైన ఉత్పత్తిని సాదించడమే ప్రభుత్వ ఆశయం.
15.ఈ మంత్రి మండలి సమావేశంలో మరికొన్ని ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చిండం జరిగింది.
రెవిన్యూ సదస్సులు……..
-రెవిన్యూ సదస్సుల అమలు తీరుపై ముఖ్యమంత్రి విస్తృతంగా సమీక్షించడం జరిగింది
-దాదాపు 1.00 లక్షకు పైగా పిటిషన్లు ఈ సదస్సుల్లో రావడం జరిగింది.
-22ఎ, ల్యాండ్ సర్వే వివాదాలు, ల్యాండ్ రికార్డులకు సంబందించిన పిటిషన్లు ఎక్కువగా వచ్చాయి.
-రెవిన్యూ సదస్సులు పూర్తి అయ్యేంత వరకూ వేచి ఉండకుండా, సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉన్న పిటిషన్లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
-క్యాబినెట్ దృష్టికి తీసుకు రావాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే వెంటనే క్యాబినెట్ దృష్టికి తీసుకురావాలన ఆదేశించారు
-ప్రజలు ఎటు వంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకై నిబందనలను కూడా సరళతరం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది
-అందుకు రెవిన్యూ, పరిశ్రమలు, ఆర్థిక మరియు పురపాలక శాఖ మంత్రులతో ఒక రాష్ట్ర స్థాయి కమిటీ నీ కూడా ఏర్పాటు చేయనున్నారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది……..
-గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విద్వంస విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఘోరంగా మారింది
-ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు రూ.40 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు మరియు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి
-ఈ ఆరు మాసాల కాలంలో వీటన్నింటినీ చెల్లించుకుంటూ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నది
-ఫించన్లను పెంచుతూ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగింది
-సామాజిక భద్రతా ఫించనును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచడం జరిగింది. వికలాంగుల ఫించన్లను కూడా పెంచడం జరిగింది
-కొన్ని లక్షల పేదవారి కడుపును మూడు పూట్లా నింపే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటుతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం జరిగింది.
-వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది
-కేంద్రం ఎప్పుడైతే రైతు భరోసాను విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ కూడా తన వాటాను రైతు భరోసా పథకం క్రింద ఇవ్వడం జరుగుతుంది.
-మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం రూ.10 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.20 వేలను ఏప్రిల్ మాసంలో మత్స్యకారులకు అందజేయాల నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-మెగా డిఎస్సీ ద్వారా 16,500 పోస్టులను ప్రకటించడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నాము
ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన దిగ్విజయానికి పటిష్టమైన చర్యలు……..
-ఈ నెల 8 వ తేదీన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విశాఖ జిల్లాలో ప్రర్యటించనున్న నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-కూటమి పార్టీల సమన్వయంతో ఒక పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి జన సమీకరణతో పాటు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడం జరిగింది
-ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ప్రధాన మంత్రి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది
-సంపత్ వినాయక దేవాలయం నుండి మీటింగ్ జరిగే ఆంధ్ర విశ్వవిధ్యాలయం వేదిక వరకూ రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది
-పూడిమడకలో ఎన్.టి.పి.సి. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు దేశ ప్రధాని శంకుస్థాపన చేయడం జరుగుతుంది
-ఈ ప్రాజక్టు ద్వారా రూ.65,370 కోట్ల పెట్టుబడులను మూడు దశల్లో పెట్టడం జరుగుతుంది.
-కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు
-రూ.1518 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తొలి దశలో 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది
-ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి
-అదే విధంగా నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్ల విలువైన బల్కు డ్రగ్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుచున్నది
-ఈ పార్కులో రూ.11,542 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని, తద్వారా 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశించడం జరుగుచున్నది
-విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.