Breaking News

గృహ లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వండి

-కేంద్రాన్ని కోరిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ వచ్చే ఐదేళ్లలో శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపికలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేంద్రాన్ని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ది పథకాలను మరింత మెరుగ్గా అమలు పర్చేందుకు అవసరమైన సూచనలు, సలహాలను అన్ని రాష్ట్రాలకు చెందిన సంబందిత మంత్రులు, ఉన్నతాధికారుల నుండి పొందేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిల్లీ నుండి శుక్రవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం నుండి ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ – 2.0 పథకం లబ్దిదారులను గుర్తించే విషయంలో కేంద్రం పది పారామీటర్లను తెలియజేస్తూ, వాటి పరిధిలోకి వచ్చిన వారిని ఆటోమేటిగ్ గా అనర్హులుగా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే వాటిలో మూడు పారామీటర్లు ప్రస్తుత సామాజిక పరిస్థితులకు విరుద్దంగా ఉన్నాయని, వాటి నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మూడు నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, మూడు నాలుగు చక్రాల వాహనాల వ్యవసాయ యంత్ర పరికరాలు కలిగి ఉన్నవారు మరియు రూ.50 వేలు, అంతకు పైబడిన క్రెడిట్ లిమిట్ కలిగిన కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగిన వారు గృహ లబ్దిదారులుగా ఎంపిక చేసేందుకు అనర్హులుగా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే ఎంతో మంది నిరుపేదలకు పలు ఆర్థిక సంస్థలు అందజేసే ఋణ సహాయంతో ఆటోలు, టాక్సీలను పొంది, వాటినే జీవనాధారంగా తమ జీవితాన్ని కొనిసాగిస్తున్నారన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయడం జరుగుచున్నదని మరియు నేటి రోజుల్లో ప్రతి కూలీ ఎంతో కష్టపడి రోజుకు రూ.600/- నుండి రూ.1,000/- ల వరకూ కూలీ సొమ్మును సంపాదించుకుంటున్న నేపథ్యంలో రూ.50 వేల క్రెడిట్ లిమిట్ కారణంగా అనర్హులుగా ప్రకటించడం సరికాదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పాయింట్లపై మినహాయింపు ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిని ఆయన కోరారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ – 2.0 పథకం క్రింద 2014 లో ప్రకటించిన యూనిట్ కాస్టు రూ.1.20 లక్షలనే ఇప్పటికీ కొనసాగించడం జరుగుచున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణీత యూనిట్ కాస్టుతో గృహ నిర్మాణాలు ఎంతో కష్టమని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఈ యూనిట్ కాస్టును పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మందికి లబ్దిచేకూర్చే విధంగా 11 వేల లే అవుట్లను నిర్మించడం జరుగుచున్నదని, ఆ లే అవుట్లలో రోడ్లు, త్రాగు నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు అదనంగా నిధులను కేంద్రం మంజూరు చేయాలని ఆయన కోరారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ – 2.0 పథకం క్రింద 2024-25 నుండి 2028-29 మధ్యకాలంలో దాదాపు 2.00 కోట్లకు పైబడి గృహాలను రాష్ట్రంలో నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెల్పిందని, అందుకు అర్హులైన లబ్దిదారులను గుర్తించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఇంజనీరింగ్ సహాయకులుగా ఇప్పటికే 14,298 మంది సర్వేయర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని, 13,101 మంది సర్వేయర్ల ఇ-కెవైసి సర్వేను కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ – 1.0 పథకం క్రింద 2.46 లక్షల గృహాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం క్రింద 21 లక్షల గృహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగిందని, వాటిలో చాలా వరకూ పూర్తి చేయడం జరిగిందన్నారు.

గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతబాబు, గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.రాజబాబు, సి.ఇ. పద్మనాభయ్య, ఎస్.ఇ. జయరామాచారి గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుండి ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *