-అద్దంకి నియోజకవర్గం భూ సమస్యలను సీసీఎల్ఏ అధికారులకు వివరించిన మంత్రి
-అలవలపాడు, గోపాపురం రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరిన గొట్టిపాటి
-మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించాలన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గం అయిన అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న కీలక భూ సమస్యలను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సదస్సులో పాల్గొన్న అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఇనాం, ఎస్టేట్ భూములకు సంబంధించి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని అధికారులను కోరారు. జే.పంగలూరు అలవలపాడు గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు తమ పట్టాల కోసం నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తక్షణమే వారి సమస్యను పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ 25 మంది రైతులకు లింక్ డాక్యూమెంట్లు లేని కారణంగా పట్టా ఇవ్వలేకపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. త్వరలోనే ఈ సమస్యపై హియరింగ్ నిర్వహించి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ… వీలైనంత త్వరగా లబ్ధిదారులకు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంతమాగులూరు మండలం, గోపాపురం గ్రామంలో సుమారు 1071 ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తి అయ్యిందని, రైతులకు పట్టాలు ఇవ్వడం పెండింగ్ ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సదస్సులో పేర్కొన్నారు. దీనిపై కూడా అధికారులు దృష్టిసారించాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు లింక్ డాక్యూమెంట్లు లేని కారణంగా ఇంకా సెటిల్మెంట్ కాలేదని పేర్కొన్నారు. అలానే లక్కవరంలోని ఎస్టేట్ భూముల సమస్యలపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. వీటితో పాటు అద్దంకి మున్సిపాల్టీలో ఏళ్ల తరబడి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని మంత్రి పేర్కొన్నారు.