-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
-తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేసారు.. ఈ మేరకు శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 3ను విడుదల చేయడంపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వంలో తెలుగు భాషకు సమచిత ప్రాధాన్యం దక్కిందని హర్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.. ఇటీవల విజయవాడలో జరిగిన ప్రపంచ ఆరవ తెలుగు రచయితల మహాసభలోనూ పలువురు భాషాభిమానులు, రచయితలు, వక్తలు ప్రభుత్వ జీవో ప్రతులు తెలుగులో ఉంటే బాగుంటుందన్న ప్రతిపాదనను పెట్టారని మంత్రి గుర్తు చేశారు.. తెలుగు భాషా పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అందులో తాను భాగస్వామిని అవుతానని చెప్పిన మాటకు త్వరితగతిన స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలన్న నిర్ణయం కూడా త్వరలోనే వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే..తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 90 శాతం మంది తెలుగు మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం అని తెలిపారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.. రాష్ట్ర భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పారదర్శకత, సమగ్రతను ప్రోత్సహించడం కోసం, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయని వివరించారు.