-రాబోయే ఐదేళ్లలో 100 శాతం ప్రకృతి సేద్యానికి కృషి
-త్వరలోనే 100 రూకార్ట్ సబ్జీ కూలర్లు…పనితీరు పరిశీలించి మరిన్ని తీసుకొస్తాం
-ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీ అయ్యే రోజులు వస్తాయి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్-2029ను విడుదల
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయంలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే నమూగా తయారు మార్చుతానని, రాబోయే ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయంగా మార్చేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ వ్యక్తికి ఏ మందులు అవసరమో ప్రస్తుతం తయారవుతున్నాయని, భవిష్యత్తులో ఏ వ్యక్తికి ఏ ఆహారం అవసరమో అదే పండించే విధానం కుప్పం నుండే ప్రారంభం కావాలని అన్నారు. మన పొలాలే ప్రజలకు శ్రీరామ రక్షగా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జనభా అంతా ఆర్గానిక్ ఆహారమే తినే పరిస్థితి వస్తుందని తెలిపారు. కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్ 2029ను సోమవారం విడుదల చేశారు. అనంతరం శీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి అయ్యారు. రైతులు చేస్తున్న సాగు పద్ధతులను అడిగి తెలుసుకుని వారి అనుభవాలు ఆసక్తిగా విన్నారు అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీ
‘రాబోయే రోజుల్లో వ్యక్తిగత ఆహారం తప్పకుండా వస్తుంది. ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీగా తయారయ్యే రోజులు వస్తాయి. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారం తింటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పెద్దల కాలంలో వారు పండించుకుని తిన్న ఆహారంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో రైతులకు మెలుకువలు నేర్పించేందుకు గతంలో పాలేకర్‌ను మన రాష్ట్రానికి పిలిచి 10 రోజులు పాటు సమావేశాలు నిర్వహించాం. ప్రకృతి వ్యవసాయం సహకారానికి ప్రపంచంలోని సంస్థలు ముందుకొచ్చాయి. మన పెద్దలు చూపిన సైన్స్‌ను తిరిగి కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన నాలెడ్జ్ ను అందించాలి. ప్రకృతి సాగులో పంటలను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగాలు చేసినప్పుడు కూడా లేని సంతోషాన్ని ప్రకృతి సాగులో చూస్తున్నామని కొందరు చెప్తున్నారు. మన రాష్ట్రంలో చేసే ప్రకృతి సాగు విధానాన్ని, మార్కెంటింగ్‌ను కంప్యూటరైజ్డ్ చేస్తన్నాం.
త్వరలో 100 రూకార్ట్ సబ్జీ కూలర్లు
రైతు సాధికార సంస్థ సమర్థవంతంగా టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ లేకుంటే ప్రకృతి పంటలను పేరు చెప్పి అమ్ముకుంటున్నారు. కొనుగోలుదారులు కూడా గందరగోళం అవుతున్నారు. అలాంటిదేమీ లేకుండా ఆర్గనైజేషన్ల ద్వారా సర్టిఫికేషన్ అందిస్తున్నారు. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. కుప్పంలో నేషనల్ డైరీ డెవలెప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) కూడా డైరీకి ఒకటి, పండ్లు కూరగాయల కోసం రెండు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోంది. దీని ద్వారా మన యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. రూకార్ట్ సబ్జీ కూలర్లను కూడా 100 తీసుకొస్తాం. వాటిల్లో కూరగాయలు, పండ్లు, పూలు ఉంచితే వారంపాటు తాజాగా ఉంటాయి. వీటి పనితీరు చూశాక మరిన్ని తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీ, చెత్త నుండి విద్యుత్ తయారీ, ప్రకృతి వ్యవసాయం అనుకున్నట్లుగా సాధిస్తే ఆసుపత్రులకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన రైతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఇక్కడికి డ్రిప్ తీసుకొచ్చాం. కుప్పం మంచి వాతావరణం కలిగిన ప్రాంతం. వాణిజ్య పంటలకు అనుకూలమైంది. దీనికి ప్రకృతి వ్యవసాయం తోడైతే మంచి మార్కెట్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.