-పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS.,
-156 వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే తరాలకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులు నూతన ఆలోచనలకు నాంది పలుకుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు.వి. IAS., అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ 2024-25ను మంగళవారం విజయవాడ మురళి రిసార్ట్స్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 156 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టులన్నీ ఆసక్తిగా తిలకిస్తూ అద్భుతమైన ప్రాజెక్టులు ప్రదర్శించారని, ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న శాస్త్రీయత, ఆలోచనా శక్తి, కృషి ఉందని విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థుల సృజనాత్మకత, సామాజిక సమస్యలకు తగిన పరిష్కారాలను కనిపెట్టిన తీరు ఆయనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. టెక్నాలజీ సాయంతో సామాన్యులకు సైతం అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ఆకాంక్షించారు. ఈ ఫెయిర్‌లో విజేతలుగా నిలిచిన 15 ఇండివిడ్యువల్ ప్రాజెక్టులు, 10 గ్రూప్ ప్రాజెక్టులు, 10 టీచర్ ఎగ్జిబిట్లను సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF) కోసం ఎంపిక చేశారు. ఈ ఫెయిర్ జనవరి 20 నుండి 25 వరకు పుదుచ్చేరి లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణ గారు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఎస్సీఈఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు.