Breaking News

28న మరో అల్పపీడనం…

-తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న కుండపోత వానలతో రెండు రాష్ట్రాల్లోని జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తెలంగాణలో శుక్రవారం వరకు తొమ్మిది జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు.. తాజాగా ఇంకో మూడు జిల్లాలను అదనంగా చేర్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. చూస్తుంటే చెరువుల మధ్యలో ఇళ్లు కట్టారా..? అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆదివారం ఉదయం 8.30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. గడిచిన 16 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్‌ లో అత్యధికంగా 25.5 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంకులంలో 17, కౌతాలలో 14.8 మిల్లీమీటర్ల వాన పడింది. మరోవైపు ఏపీలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దేవీ పట్నంలో పోచమ్మ ఆలయం నీట మునిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలు లేవు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఇటు కృష్ణానదికి కూడా వరదనీరు పోటెత్తుతోంది. ఇక వాతావరణశాఖ మరో బాంబు పేల్చింది. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు పడుతుంటే.. 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షపాతం పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *