విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
26 రాష్ట్రాలకు చెందిన బిసి ఎంపీలతో ఢిల్లీలోని ఏపీ భవన్ లో బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు చెప్పారు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తమ పోరాటం ఉంటుందని తెలియజేశారు.
గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన ‘హలో బిసి చలో ఢిల్లీ’ పేరుతో కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపి భవన్ లో బీసీల సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నట్లు చెప్పారు…తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు..ఈ సమావేశంలో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు వందల మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బిసి కులగణన లాంటి అంశాలు లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పోరాటం ఉంటుందని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత ఐదు దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగు విక్రమ్, పి.సాయికిరణ్, మెండెం జ్యోతి, పోతిన వరప్రకాష్, జవ్వాది సుధీర్, హేమ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
