సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచండి

-పన్ను ఎగవేతలు ఉండకూడదు…అలా అని వ్యాపారులపై వేధింపులు వద్దు
-ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి….ఫలితాలు కనిపించాలి
-అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ధికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాల్లోంచి బయట పడేసేందుకు సమర్థవంత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో రొటీన్‌గా పనిచేస్తే ఫలితాలు రావని…వినూత్న ఆలోచనలతో పనిచేయాలని సిఎం అన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సిఎం సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై సిఎం మాట్లాడుతూ….ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు. అలా అని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సిఎం సూచించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే గాడిన పడాలి…
సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని…దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సిఎం సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని….ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని… ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని సిఎం అన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, 16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి గంటా 45 నిమిషాల పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించానని, ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని సిఎం అన్నారు. అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలని సిఎం సూచించారు.

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం అంచనా రూ.1,02,154 కోట్లు
రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. 2023-24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420 కోట్లు రాగా…ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.41382 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా గతేడాదితో పోల్చితే నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఈ శాఖలో ఆదాయం పెరుగుతుందని అధికారులు వివరించారు. ఇకపోతే మైనింగ్ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని అధికారులు వివరించారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సిఎం అన్నారు. రాష్ట్రానికి ఉన్న మైనింగ్ వనరుల దృష్ట్యా…ఈ విభాగంలో అత్యధిక ఆదాయం రావాలని సిఎం అన్నారు.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి-వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంమ్మీద 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రూ.1,02,154 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని…అధికారులు శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *