-కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి స్వాతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్ లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రానున్న ఆగష్టు, 15వ తేదీన రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారని, పోలీసుల కవాతు అనంతరం ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వేడుకలకు ముందు రోజు నుండి విజయవాడ లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని విద్యుత్ దీపకాంతులతో అలంకరించాలని, నగరంలోని ప్రధాన రహదారులలో పూల మొక్కలతో అలంకరించాలన్నారు. శకటాల ప్రదర్శన కు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సమాచార పౌర సంబంధ శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డిని సిఎస్ ఆదేశించారు. వేడుకల నిర్వహణకు హాజరయ్యే పోలీసు అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ను సిఎస్ ఆదేశించారు. సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణపై సమాచారశాఖ కమిషనర్ ప్రణాళిక రూపొందించి సమర్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సిఎస్ చెప్పారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని వర్షం కురిసినా కూడా ఏటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు.