-రైతు భరోసా రథం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన రైతు భరోసా రథాన్ని కుందావారి కండ్రికలోని రైతు భరోసా కేంద్రం వద్ద శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార రథం ద్వారా ప్రదర్శించిన వీడియోని రైతన్నలతో కలిసి ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లా వ్యవసాయానికి కేంద్ర బిందువుగా విరాజిల్లిందని చెప్పుకొచ్చారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ.. నేడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. అంతేకాకుండా రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ పథకాలతో జగనన్న ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ‘రైతు భరోసా రథం’ ద్వారా వ్యవసాయ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం వివరాలు, సస్యరక్షణ చర్యలపై నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ స్క్రిన్ ఉన్న ఈ రథం ద్వారా తొలుత రైతు భరోసా చైతన్య యాత్రలు జరిగే ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సొసైటీ బ్యాంకు చైర్మన్ మూలగోళ్ల రవీంద్రారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు యర్రగొర్ల శ్రీరాములు, గ్రామపెద్దలు దేవిరెడ్డి సాంబరెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, వీరయ్య, దేవిరెడ్డి సంజీవరెడ్డి, సాదం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.