విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యా శాతాన్ని పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని D. V. సుబ్బారెడ్డి పాఠశాల నందు జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో విద్యావిధానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని తెలిపారు. రెండేళ్ల కాలంలో రూ. 30 వేల కోట్ల నిధులు విద్యారంగానికి ఖర్చు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా విద్యాకానుక కింద ప్రతి ఒక్క విద్యార్థికీ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కిట్ల నాణ్యతలోనూ ఎక్కడా రాజీ పడలేదన్నారు. జగనన్న విద్యా కానుక పథకం కింద ఇప్పటివరకు రూ.1.380 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయని మల్లాది విష్ణు తెలిపారు. తొలివిడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలలను జాతికి అంకితం ఇస్తూనే.. రూ. 4,535 కోట్లతో రెండోదశలో 16,368 పాఠశాలల్లో పనులు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. కరోనా కారణంగా నాడు-నేడు తొలిదశ పనులను విజయవాడలో ప్రారంభించుకోలేకపోయామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ పనులకు సంబంధించి రూ. 20 కోట్ల నిధులు మంజూరు కాగా.. D. V. సుబ్బారెడ్డి పాఠశాల అభివృద్ధికి రూ. 60 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో వచ్చే విద్యా సంవత్సరం కల్లా పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల నందు చదువుతున్న 687 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీవైఈవో రవి, హెడ్ మాస్టర్ కె.వి.దుర్గారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీమతి లలిత, వైస్ చైర్మన్ నాగేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …