-జగనన్న విద్యాకానుక ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని M.K.బేగ్ ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని స్థానిక కార్పొరేటర్ షేక్ షాహినా సుల్తానా తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ.. దేశంలో మరే ప్రభుత్వం సారించలేదన్నారు. సమాజంలో చదువుకున్న వారికి లభించే గౌరవం.. ఎంత డబ్బున్నా దొరకదన్నారు. కనుకనే ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎన్ రోల్ చేసుకున్నారని చెప్పారు. మరోవైపు నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 20 కోట్ల నిధులతో 30 పాఠశాలలను అభివృద్ధి పరచుకోబోతున్నట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ఇందులో రూ. 25 లక్షలతో M.K.బేగ్ ప్రైమరీ స్కూల్ ను, రూ. 40 లక్షలతో హైస్కూల్ ను కూడా అభివృద్ధి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘానికి చెందిన రూ. కోటి 50 లక్షల నిధులతో పాఠశాలలో నూతన భవనాన్ని నిర్మించుకోబోతున్నట్లు వెల్లడించారు. అవసరమైతే పాఠశాల ప్రాంగణంలోనే జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకుందామని భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో సింగ్ నగర్ ను విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దుకుందామని మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న 1,269 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీవైఈవో రవి, మైనార్టీ నాయకులు హఫీజుల్లా, స్థానిక నాయకులు సురేష్, రమేష్, రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.