విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలు, పిల్లలకు నూటికి నూరు శాతం పోషకాహారం పంపిణీ జరిగే విధంగా చూడాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోషకాహార మాసోత్సవం కార్యక్రమాన్ని 30వ డివిజన్ కేఎల్ రావు నగర్ – 3 లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ వరకు పోషకాహార మాసోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 7 నుంచి 36 నెలలలోపు పిల్లలకు నెలాఖరు వరకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలియజేశారు. పోషకాహారంతో పాటు ఆరోగ్య సూత్రాలను తెలియపరిచేవిధంగా సలహాలు, సూచనలు అందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా గర్బిణీలు మంచి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని, అపుడే పుట్టబోయే బిడ్డ సైతం ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు. ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆహారంలో ఉండాల్సిన పోషకాలు, వాటి ఆవశ్యకత, ఆరోగ్య పరిరక్షణలో పోషకాహార ప్రాధాన్యతను వివరించాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేసే సరుకుల నాణ్యతను తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూపర్ వైజర్లను ఆదేశించారు. మరోవైపు వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. అనంతరం డివిజన్ లోని 132 మంది బాలింతలు, గర్బిణీలు, 367 మందికి చిన్నారులకు బాలామృతం కిట్లను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, అంగన్వాడీ సూపర్ వైజర్ రోజా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …