తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల పేర్లు.. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్ ఇంటర్నేషన్ సంస్థ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది.
ఆలోచనకు పునాది పడింది ఇలా…
తితిదే ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో అయితే పుష్పాల వినియోగం మరింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. దీంతో స్వామివారి సేవకు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తితిదే ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగరబత్తులు తయారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థతో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సొంత ఖర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించింది.
Prajavartha Online Telugu News