-ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పింఛన్లపై ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబేకాలనీ ఎఫ్.బ్లాక్ లో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ , వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు సరఫరాపై ఎక్కువ ఫిర్యాదులు అందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్లు మరమ్మతులకు గురై రోజులు గడుస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు మంచినీటి ట్యాంక్ ల సంఖ్య పెంచాలని.. అవి కూడా కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.
అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. పింఛన్లపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా తెలియజేశారన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గత తెలుగుదేశం హయాంలో 35 లక్షల మందికే మాత్రమే పింఛన్లు అందేవని.. అది కూడా వెయ్యి చొప్పున రూ.350 కోట్లు మాత్రమే అందజేసేవారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 61,46,908 మందికి రూ. 1,497.63 కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తోందన్నారు. కరోనా, లాక్‌డౌన్ సమయంలోనూ పింఛన్ దారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకాన్ని యథావిధిగా అమలు చేశామని గుర్తుచేశారు. మరోవైపు వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి.. త్వరలోనే స్థానిక కమ్యూనిటీ హాల్లో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మల్లాది విష్ణు తెలియజేశారు. టౌన్ ప్లానింగ్ మరియు గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని చేపడతామని హామీనిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో డివిజన్ లో 1,806 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక, 2,829 మందికి అమ్మఒడి, 1,313 మందికి ఇళ్ల పట్టాలు, 476 మందికి చేయూత, 126 మందికి కాపునేస్తం, 113 మందికి జగనన్న తోడు, 68 మంది చేదోడు, 202 మందికి వాహనమిత్ర, 416 మందికి విద్యాదీవెన పథకాల రూపంలో లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నాని, ఇస్మాయిల్, బత్తుల దుర్గారావు, బలగ శ్రీను, హనుమంతు, దుర్గారావు, సుభానీ, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.