-మౌలిక సదుపాయలు, అక్షర హంగులకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచి అభ్యసనానికి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించే లక్ష్యంతో చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలలు కొత్త హంగులను సంతరించుకుంటున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు, పాఠశాల మౌలిక వసతులను అభివృద్ధిపరచి చదువుకునేందుకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాడు నేడు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 10 రకాల మౌలిక వసతుల కల్పనకై ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలో నాడు నేడు మొదటి దశలో భాగంగా 1153 పాఠశాలలో రూ. 261,90 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనుల్లో భాగంగా పాఠశాలల గోడల సైతం విద్యార్థులకు పాఠాలు చెప్పేలా తీర్చిద్దారు. తరగతి గదుల లోపల, బయట ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందించారు. విద్యార్థులు అడుకునే చిత్రాలు, అఆఇఈ, ఏబిసిడి, వంటి అక్షర మాలలు, జాతీయ నేతల చిత్రాల , ఆహ్లాదకరమైన చెట్లు తదితర ప్రకృతి సౌందర్యమైన చిత్రాలను పాఠశాల గోడలపై పెయింట్ చేశారు. పాఠశాలలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి చదువుపై ఆసక్తి పెరిగేలా కొత్త అంశాలు నేర్చుకోవాలనే నూతనోత్సాహం విద్యార్థులో కల్పిసున్నాయి. నాడు – నేడు పనులు జరిగిన ప్రతీ పాఠశాలల్లో నల్లబోర్డు స్థానంలో పచ్చబోర్డు (గ్రీన్ బోర్డు) ఏర్పాటు చేశారు. దీంతో రంగురంగుల అక్షరాలు కనులకు ఇంపుగా ఉండటమే కాకుండా కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని వీటిని తరగతి గదుల్లో అనువైన చోట అమర్చుకోవచ్చని విద్యావేత్తలు చెబుతున్నారు. భవిష్యత్ లో అన్ని పాఠశాలల్లోను ఇదే విధానం అమలుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నాడు-నేడు పనుల జరిగిన పాఠశాలన్నింటిలోను ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల గోడల పై వేసిన చిత్రాలు, అక్షరాలను చూసి విషయ పరిజ్ఞానం పెంచుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రీన్ బోర్డు పై బోదనకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం ఇందుకు నిదర్శనం. గతేడాది సుమారు 53 వేల మంది విద్యార్థుల సంఖ్య పెరగగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగింది. నాడు-నేడుతో అభివృద్ధి చెందిన మాబడిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో మాటల్లో చెప్పాలేనని నందిగామ జడ్పీ పాఠశాల విద్యార్థిని సిహెచ్ నాగజ్యోతిక అన్నారు.