Breaking News

పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం – హోమ్ స్టే విధానం ప్రారంభం

-బడ్జెట్ వసతి, స్థానికులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
–కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా “హోమ్ స్టే మరియు బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ విధానం 2024–2029”ను ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. హోమ్ స్టే యజమానులు 7 సంవత్సరాలపాటు 100 శాతం SGST తిరిగి చెల్లింపు, మొదటి మూడు సంవత్సరాలపాటు ఉచిత రిజిస్ట్రేషన్, అలాగే విద్యుత్, నీరు, చెత్త మరియు ఆస్తి పన్ను రేట్లలో గృహ వినియోగ రేట్లు వర్తించనున్నాయి. పీఎం సూర్యఘర్ యోజన కింద సబ్సిడీపై సౌరశక్తి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించబడింది. అలాగే ముద్రా పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉంటాయి.

ఈ విధానం ద్వారా పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి లభించడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు..ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ఇది నూతన దిశానిర్దేశం అవుతుందని పేర్కొన్నారు.

హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు తమ నివాస గృహంలో కనీసం ఒక గది నుండి గరిష్టంగా ఆరు గదుల వరకు పర్యాటకులకు అద్దెకు ఇవ్వవచ్చు అని తెలియ చేశారు. యజమాని తప్పనిసరిగా ఆ ప్రాంగణంలో నివసిస్తూ ఉండాలనీ , హోమ్ స్టేలో ఏసీ, టీవీ, ఇంటర్నెట్, ఫర్నీచర్, పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, భద్రతా సదుపాయాలు ఉండాలన్నారు. హోమ్ స్టే సమయంలో ప్రతి పర్యాటకుడి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.

స్వదేశ దర్శన్ (గిరిజన పర్యాటక) పథకం కింద ఈ విధానంలో కొత్త హోమ్ స్టే యజమానులకు రూ.5 లక్షల ప్రోత్సాహకం, పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించ బడుతుందన్నారు.

హోం స్టే పథకంలో శిక్షణ & నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటాయనీ పేర్కొన్నారు. APTA మరియు ఇతర సంస్థల ద్వారా అతిథ్య సేవలు, పరిశుభ్రత, భద్రత, సేవా నాణ్యత అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందనీ తెలియ చేశారు. SERP, NRLM సంస్థలతో భాగస్వామ్యంలో ఆర్థిక మరియు మౌలిక వసతుల మద్దతు ఇవ్వనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు.

నమోదు మరియు పాలన బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (APTA) ఆధ్వర్యంలో ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ (DTC) దరఖాస్తులను పరిశీలిస్తుంది. హోమ్ స్టే నమోదు చెల్లుబాటు 2 సంవత్సరాలు, తదుపరి పునరుద్ధరణ అవసరం అన్నారు. హోమ్ స్టేలను సిల్వర్ (ప్రాథమిక సౌకర్యాలు) మరియు గోల్డ్ (ప్రీమియం ప్రమాణాలు) వర్గాలుగా విభజిస్తారు.

మరిన్ని వివరాలకు పౌరులు పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ https://homestays.staging.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *