Breaking News

భారీ వర్షాల కారణంగా డివిజన్ లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి – అధికారులకు ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాల కారణంగా నూజివీడు డివిజన్ లో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. గులాబ్ తుఫాన్ పరిస్థితి పై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాజ్ వే ల పై వరద నీరు ప్రమాదకరమైన రీతిలో ప్రవహించే అవకాశం ఉన్నందున, కాజ్ వే ల పై నుండి ఎటువంటి వాహనాలు అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గంపలగూడెం, తిరువూరు చాట్రాయి ,ఏ కొండూరు తదితర మండలాల్లో కాజ్ వే ల పై వాహనాలు ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు గ్రామాలలోని వీఆర్వోలు , అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ ఆదేశించారు. మంచి నీటి వనరుల కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, వర్షపు నీరు డ్రైనేజీలలో నిల్వ ఉండకుండా జరిగేలా చూడాలన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేందుకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08656 – 232717 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పంట నష్టం వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖాధికారులను, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య శాఖాధికారులను ఆర్డీఓ ఆదేశించారు. సమావేశంలో పంచాయతీ రాజ్, వైద్య శాఖ అధికారులు, డివిజనల్ పరిపాలనాధికారి ఎం. హరనాథ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *