-గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
-వర్షపు నీటి మునిగిన ప్రదేశాలలో విస్తృతoగా పర్యటించిన మేయర్, కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిధిలోని బందరు రోడ్, బి.ఆర్.పి రోడ్, కొత్తపేట గణపతిరావు రోడ్, వించి పేట, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, కబేళా రోడ్, భవానిపురం, హెచ్.బి. కాలనీ, కాంబె రోడ్, బైపాస్ అవుట్ లైన్ రోడ్డు, ఊర్మిళా నగర్, కృష్ణ లంక, ప్రశాంతి కట్ పిసెస్ రోడ్, ఏలూరు రోడ్, మొదలగు ప్రాంతాలలో సోమవారం నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి పర్యటించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. సింగ్ నగర్ కుందావారి కండ్రిక ప్రాంతములో సెంట్రల్ నియోజక వర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ తో కలసి నియోజక వర్గ పరిధిలో పలు ప్రదేశాలలో వర్షపు నీటితో మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.
గత రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నీట మునిగిన రోడ్లు మరియు డ్రెయిన్లలలో వర్షపు నీటి పారుదల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బైపాస్ రోడ్, ఊర్మిళా నగర్ ప్రాంతాలలో కల్వర్ట్ లను పరిశీలిస్తూ, కల్వర్ట్ల క్రింద నీటి ప్రవాహమునకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు అందరు వారికీ కేటాయించిన డివిజన్లలో సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బందితో కలసి డివిజన్లలో పర్యటిస్తూ, రోడ్లపై లేదా వీధులలో వర్షపు నీటి నిల్వలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు / సిబ్బంది తోడ్పాటుతో యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టి వర్షపునీటిని డ్రెయిన్ లకు మళ్ళించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి ఎక్కడ వర్షపు నీరు నిల్వలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లలో వర్షపు నీటి ప్రవాహమునకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్స్ ద్వారా వర్షపు నీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ. పి.వీ.కె భాస్కరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.నారాయణమూర్తి, వీ.శ్రీనివాస్, వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.