-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావితరానికి మహాత్ముని ఆశయాలు, లక్ష్యాలు, విలువలతో కూడుకున్న సిద్ధాంతాలను నేర్పించాలని, అది విద్యావ్యవస్థ ద్వారే సాధ్యమని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు అన్నారు. శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ నయీ తాలీం ద్వారా ప్రతిపాదించిన ‘పని చేస్తూ విద్య నేర్చుకోవడం’ విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థులు శ్రమశక్తిలో మమేకమై అనేక వృత్తి పనులు నేర్చుకోగలరని అన్నారు. తద్వారా స్వశక్తితో జీవితం గడవచ్చని అన్నారు. సత్యం, శాంతి, అహింస ఆయుధాలతో పోరాడి స్వాతంత్ర్యం సాధించి ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.