-సోదర భావంతో చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం ముందుకు సాగాలి…
-ఎఫ్‌టిపీసీ-ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ వర్మ పాకలపాటి
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గడచిన 8 దశాబ్ధాలుగా అనేక విజయవంతమైన చిత్రాలకు అందమైన, ఆహ్లాదమైన, చారిత్రాత్మకమైన లొకేషన్లను వేలాది మంది సాంకేతిక నిపుణులను, వెయ్యికిపైగా నటీనటులను అందించిన ఆంధ్రప్రదేశ్ గడ్డ ఇక్కడ పరిశ్రమ స్థిరంగా వేళ్లూనుకునేలాగా ఇంకా ముందుకు సాగకపోవడం శోచనీయమని, విదేశీ లొకేషన్లకు కూడా తీసిపోని సుందర ప్రదేశాలను, ఏ చలనచిత్ర పరిశ్రమకు తీసిపోని ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణుల నటీనటులు ఉన్న ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్ష్య, కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ వర్మ పాకలపాటిలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ హోటల్‌లో ఆదివారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటీమణి సనయాబసు, మరియు పలువురు సినీ నిర్మాతలతో కలిపి వారు ప్రసంగించారు.
అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం పరిశ్రమ తిరిగి ఆంధ్రప్రదేశ్‌కి రావాలన్నారు. స్థానిక కళాకారుల సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్ మరియు బ్రాండింగ్ వంటి అనేక వినోద మాద్యమాలలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎఫ్‌టీపీసీ-ఏపీని 2018లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విజయవాడలో ఇప్పటికి రెండు వర్క్‌షాప్‌లను నిర్వహించిన తాము 2022లో సంక్రాంతి తరువాత రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతి జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకుని శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి శాఖపై అవగాహన కల్పించే విధంగా వర్క్‌షాప్‌లను నిర్వహించడం చలనచిత్ర అనుబంధ వ్యాపారాలలో శిక్షణ అందించి స్వయం ఉపాధి దిశగా యువతను ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ పరిశ్రమ అడిగిందే తడవుగా ఏమి కావాలో అది చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తుండటం శుభపరిణామమని, స్థిరంగా పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందేందుకు సినీ పరిశ్రమ, ప్రభుత్వం సోదర భావంతో ముందుకు సాగాలని తెలిపారు. తాము కోరిన విధంగా ఆన్‌లైన్ టిక్కెట్లను ప్రవేశపెట్టడం ద్వారా నిర్మాతలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. పరిశ్రమ ఇక్కడ వేళ్లూనుకోవడం ద్వారా పెద్ద తెర, బుల్లి తెర నిర్మాతలకు మరిన్ని ప్రోత్సాహాకాలు ఇవ్వాలని, ఈ విషయంలో యూపీ, ఉత్తరాఖాండ్, హర్యానా, మహారాష్ట్ర, కాశ్మీర్, జార్ఖండ్‌లను ఉదాహరణగా తీసుకోవాలని తెలిపారు. అలాగే కొద్దికాలం పాటు ఇక్కడ లొకేషన్లను నిర్మాణాంతర సేవలను ఉపయోగించుకొని అన్ని చిత్రాలకు చిత్ర స్థాయిని బట్టి సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని, అలాగే ఆసక్తి గల సంస్థలకు భూములు, వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్టూడియోలు, సంబంధిత ఎడిటింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని, అలాగే రెండేళ్లల్లో స్థిర నివాసం ఏర్పాటుకు సిద్ధమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి విశాఖలో ఫిల్మ్ నగర్ ఏర్పాటు చేయాలని కోరారు.
విశాఖ అందాలు ఆకట్టుకున్నాయి… : బాలీవుడ్ నటీమణి సనయాబసు
బాలీవుడ్ నటీమణి సనయాబసు మాట్లాడుతూ విశాఖ అందాలకు ముగ్ధురాలైనట్లు తెలిపారు. ఏపీలోని అన్ని లొకేషన్ వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేసిఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషి అమోఘం అని కొనియాడారు. సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్‌లు భాషల వారీగా తెలిసేలా కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యం ఉన్న దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇక్కడ ఉన్నారని విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కిందని వెల్లడించారు.